Published On: Mon, Nov 20th, 2017

ఇక సమన్వయ వ్యవ‘సాయం’…!

* సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డి 

సెల్ఐటి న్యూస్‌, స‌చివాల‌యం (అమరావతి): ప్రాథమిక రంగంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలంటే సంబంధిత శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆశించిన ప్రగతి సాధించాలంటే జల వనరులు, వ్యవసాయ, వ్యవసాయానుబంధ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ శాఖల మధ్య అనుసంధానం ఉండాలని ఆయన సోమవారం సాయంత్రం పోలవరం సమీక్షా సమావేశానికి ముందు ఆయా శాఖల ముఖ్య అధికారులతో సమావేశమై చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక నుంచి సాగునీటికి సంబంధించిన కార్య ప్రణాళికలను రూపొందించేముందు జల వనరుల శాఖ స్వతంత్రంగా కాకుండా వ్యవసాయ, వ్యవసాయానుబంధ, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉదాహరణకు పంటకుంటల తవ్వకం గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోనివే అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న జలవనరులను గుర్తించడం, వాటికి జియో ట్యాగింగ్ చేయడం జల వనరులశాఖ బాధ్యతగా ఉందని, అటువంటప్పుడు ఈ రెండుశాఖల మధ్య సమన్వయం ఉంటేనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారని చెప్పారు. వర్మీకంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాలు పశు సంవర్ధక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు రెండింటికీ సంబంధించినవని, ఎవరికి వారుగా కాకుండా ఉభయ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. ఇక మీదట ప్రతి సోమవారం ఈ ఐదు శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ కాన్ఫరెన్సులో ఆయా శాఖల పురోగతిని సమీక్షించడమే కాకుండా, ఏ అధికారి దగ్గర సమన్వయ లోపం ఉందో, మిగిలిన శాఖలను కలుపుకుంటూ జిల్లా కలెక్టర్ల స్థాయిలోనూ విశ్లేషణ జరిపి, ఎవరు, ఎలా పనిచేయగలుగుతున్నారో వివరాలు అందిస్తామని అన్నారు. ఉమ్మడి పని విధానం ద్వారా ప్రభుత్వ శాఖలలో జవాబుదారితనం పెంచి వెనుకబడిన చోట సానబెట్టాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖలో ఇటీవల జరిగిన హ్యాకథాన్ నుంచి నేర్చుకున్న విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించాలని, దీనికి సంబంధించిన సమగ్ర కార్య ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి వ్యవసాయశాఖను ఆదేశించారు. రాబోయే కాలానికి సమగ్ర వ్యవసాయ ప్రణాళికల గురించి మంగళవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తానని వెల్లడించారు. సస్యరక్షణలో ఉపయోగించే ఎరువులు, పురుగు మందుల వాడకం, వాటికి పెట్టే ఖర్చుల వివరాలను ఇక విధిగా పొందుపరచాలని, రైతుల ఆధార్ అనుసంధానం ద్వారా వీటిని సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడలో ‘ఇండియా రైస్ కాంక్లేవ్’ జరుగుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సమావేశంలో తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఆతిధ్యం ఇస్తున్న ఈ కాంక్లేవ్‌ను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు.

Just In...