Published On: Mon, Aug 19th, 2019

ఇగ్నో కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు

* ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ దోనేపూడి రామాంజనేయశర్మ వెల్లడి

సెల్ఐటి న్యూస్, ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అందించే సర్టిఫికెట్, డిప్లమో, బి.ఎ., బి.కామ్ కోర్సుల్లో చేరదలచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు కలిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ దోనేపూడి రామాంజనేయశర్మ చెప్పారు. ఇగ్నో అందించే కోర్సులు, అడ్మిషన్ విధానం, ఉద్యోగావకాశాలపై సోమవారం గాంధీనగర్ లోని ఎస్.ఆర్.ఎస్.వి బీఈడీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయశర్మ మాట్లాడుతూ జులై 2019 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 27 తేదీలోగా విజయవాడ పాతబస్తీలోని ఇగ్నో ప్రాంతీయకార్యాలయంలో నేరుగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలన్నారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలన్నీ ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఉంటాయని, ఆ ప్రాంతాల విద్యార్థులు కూడా విజయవాడ కేంద్రం ద్వారా ఇగ్నో కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇగ్నో అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ బి.ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇగ్నోలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోర్సును చదువుకునేందుకు, వారి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్నిరకాల వర్గాల వారు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఫంక్షనల్ ఇంగ్లిష్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్స్, గైడెన్స్, విపత్తు నిర్వహణ, ఎన్.జి.ఒ మేనేజ్మెంట్ తదితర కోర్సులకు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు చదువుకోవచ్చన్నారు. చార్టెర్డ్ ఎకౌంటెన్సీ చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించే బీకాం ఎకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కోర్సుకు మాత్రం దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలన్నారు. రెగ్యులర్గా కళాశాలలో డిగ్రీ చదువుతున్న లేదా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా సర్టిఫికెట్ కోర్సులను యాడ్ ఆన్ కోర్సులుగా చదువుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు విజయవాడ కె.బి.ఎన్.కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో స్వయంగా లేదా కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని గాని సంప్రదించవచ్చన్నారు. ఫోన్ 0866-2565959 నంబరులో కార్యాలయ పనివేళల్లో సంప్రదించినా పూర్తి వివరాలు అందిస్తామన్నారు. ఇగ్నో కోర్సుల వివరాలతో రూపొందించిన బ్రోచర్లు అతిథులు ఆవిష్కరించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శ్రీనివాసమూర్తి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ బి. హెచ్.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...