Published On: Sat, May 18th, 2019

ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదు

* 34 రోజుల త‌రువాత రీ పోలింగా.. 

* ఇదేం తీరు అని ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంత‌రం

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారులతో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ శుక్ర‌వారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, ఇతర కమిషనర్లతో భేటీ అయిన సీఎం.. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించారు. తొలుత చంద్రగిరిలో రీపోలింగ్‌ వ్యవహారంపై రాసిన లేఖను సీఈసీకి అందజేశారు. తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని నిలదీసినట్టు సీఎం మీడియాకు వివరించారు. సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని.. కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోందన్నారు. 24 ఏళ్లుగా తాను తెదేపా అధ్యక్షుడిగా ఉన్నానని, జాతీయ రాజకీయాలను చూశానన్న ఆయన ఈ విధమైన ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా ఫారం -7 పత్రాలు ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ స్పందించలేదని సీఎం చంద్ర‌బాబు మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని అవమానించేలా  భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Just In...