Published On: Mon, Jun 25th, 2018

ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు

* భాజ‌పా జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహ‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్ నరసింహరావు ఆరోపించారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జీవీఎల్ మాట్లాడారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడమేంటని ప్రశ్నించారు. దేశ రాజధాని దిల్లీ, రాష్ట్ర రాజధాని విజయవాడలో కూడా అంత ఖర్చు కాదన్నారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని.. పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి 7లక్షలకు పైగా గృహాలు కేటాయిస్తే ఇప్పటి వరకూ 43వేలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. నంబర్‌వన్‌ పరిపాలన, 40ఏళ్ల అనుభవం ఉన్న వారి పరిపాలన అంటే ఇలాగే ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. 2022కల్లా దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నరేంద్రమోదీ ఈ పథకానికి రూపకల్పన చేస్తే.. ఆ ఆశయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం వద్ద బిల్లు పెండింగ్‌లో లేవన్నారు. కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే మోకాలడ్డుతోందని ఆరోపించారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Just In...