Published On: Mon, Nov 25th, 2019

ఇసుక, నిత్యావసరాల రవాణాతో నిరుద్యోగులకు స్వయంఉపాధి

* వైయస్సార్ ఆదర్శంపై స‌మీక్ష‌లో సీఎస్ నీలం సాహ్ని

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఇసుక,ఇతర నిత్యావసర వస్తువులు రవాణా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన వైయస్సార్ ఆదర్శంపై వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వైఎస్సార్ ఆదర్శం కింద ఇసుక, ఇతర నిత్యావసర వస్తువులు రవాణా చేయించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందుకు సంబంధించి ఎపి మినరల్ డెవలప్ మెంట్  కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ, ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన వివిధ వస్తువులను ఈ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ద్వారా ప్రలకు అందించేందుకు అవసరమైన వాహనాలను కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  ఇందుకుగాను వివిధ సంక్షేమశాఖలు, బ్యాంకుల బ్యాంకు ఋణం అనుసంధానంతో లబ్దిదారుల వాటాతో కలిపి సుమారు 6వేల పాత ట్రక్కులను ఒక్కొక్కటి 24లక్షల రూ.లు వ్యయంతో కొనుగోలు చేసి అందించడం ద్వారా ఇసుక,ఇతర నిత్యావసర సరుకులు రవాణా చేయించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని సిఎస్ పేర్కొన్నారు.కావున ఈఅంశంపై వివిధ సంక్షేమశాఖలు,కార్పొరేషన్లు కూర్చుని చర్చించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి రావాలని సిఎస్ నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖలో ముఖ్య కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, రిజ్వీ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి యం.రవిచంద్ర, గనుల శాఖ కార్యదర్శి రాం గోపాల్, రవాణాశాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఎండి జి.చంద్రుడు, పౌరసరఫరాల సంస్థ విసి అండ్ ఎండి సూర్యకుమారి, కాపు కారొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Just In...