Published On: Mon, Aug 21st, 2017

ఇసుక రవాణా ఛార్జీలపై అధికారుల పర్యవేక్షణ త‌ప్ప‌నిస‌రి

* ఇక‌పై మీ సేవ కేంద్రాల్లోనూ చెల్లింపులు చేయోచ్చు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇసుక రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా అమలు జరుగుతున్నదీ లేనిదీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టరు బి.లక్ష్మీకాంతం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుకను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా ఇసుక రవాణా ఛార్జీలను చెల్లించే విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇసుక రవాణా ఛార్జీలపై స్థానికంగా విస్తృతం ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇసుక రేవుల వద్ద వారం రోజుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులతో నగరంలోని తమ విడిది కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. గన్నవరం విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులను వేగవతంగా చేయాలని సూచించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసే పందిళ్లకు అనుమతులు జారీ చేయడానికి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగిల్‌ విండో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వరి నాట్లు పూర్తి కావస్తున్న క్రమంలో అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలోని కాల్వల చివరి ఆయకట్టు భూములకు నీరు అందేలా నీటి విడుదలను 8 వేల క్యూసెక్కుల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచుతున్నట్లు తెలిపారు. జక్కంపూడి కాలనీలో ప్రబలిన విష జ్వరాలను అరికట్టడంలో చేపట్టిన విధానాలపై ప్రభుత్వం నుంచి ప్రశంసలు వచ్చినట్లు కలెక్టరు తెలిపారు. ఈసమావేశంలో జేసీ గంధం చంద్రుడు, డీసీపీ భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

sand_reach_1

Just In...