Published On: Wed, Feb 13th, 2019

ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై ప్ర‌జ‌ల‌కు అవగాహన క‌ల్పించండి

* వీసీలో క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఎస్ అనిల్‌చంద్ర పునేఠ ఆదేశాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయం నుంచి బుధ‌వారం 13 జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లకు సరిపడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ఉన్నాయా .. లేవా? అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ యంత్రాల పనితీరు పరిశీలించాలని, ఇంకా అవసరమనుకుంటే మరిన్నియంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రప్పించాలని ఆదేశించారు. ఓటింగ్ యంత్రాల భద్రత కోసం ప్రత్యేక గోదాములను తక్షణం నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వికలాంగుల కోసం ర్యాంప్ లు ఏర్పాటు చేయాలని, వారి కోసం ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏ క్షణాన్నయినా రావొచ్చని, ఎక్కడయినా బదిలీలు పెండింగ్ లో ఉంటే తక్షణమే పూర్తి చేయాలని, మిగిలిన 6 జిల్లాల కలెక్టర్లు ఈ నెలాఖరులోగా బదిలీలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలు ఎప్పటికప్పుడు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపైనా, ఎన్నికల సమస్యలపై 1950 కాల్ సెంటర్‌కు ఉచితంగా ఫిర్యాదు చేయొచ్చునే విషయంపైనా ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది, స్పెషల్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, సచివాలయ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అడిషనల్ సీఈవో వివేక్ యాదవ్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...