Published On: Mon, Apr 16th, 2018

ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీటిని అందించాలి

* నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీటిని అందించాలి. సకాలంలో సేద్యం పనులు పూర్తి కావాలి. రెయిన్ గన్స్ ముందస్తుగా సంసిద్ధం చేసుకోవాలి. ఖరీఫ్ సేద్యం ప్రణాళికలు పటిష్టంగా అమలు చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యం నుంచి నీరు-ప్ర‌గ‌తి, వ్య‌వ‌సాయంపై జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలి. సూక్ష్మ పోషకాలు రైతులకు ఉచితంగా అందజేయాలి. సూక్ష్మ పోషకాల వినియోగం వల్ల వివిధ పంటల దిగుబడులు పెరిగాయి. అంతర్జాతీయంగా మేలైన పద్ధతులు అధ్యయనం చేయాలి. వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి. ప్రతి ఏటా పంట దిగుబడులు గణనీయంగా పెరగాలి. పోషకాహార లోపం అనేదే మనరాష్ట్రంలో ఉత్పన్నం కారాదు. ప్రతి శాఖలో సామర్ధ్యాలు మెరుగు పరుచుకోవాలి. ప్రతి శాఖలో సాధించిన ఫలితాలే ప్రామాణికం. నెలవారీ, క్వార్టర్లీ ప్రగతిని విశ్లేషించాలి, లక్ష్యాలను చేరుకోవాలి. రోజురోజుకు సామర్ధ్యం మెరుగుపడాలి, వినూత్న ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్ధంగా అమలుచేయాల‌న్నారు.

మెకనైజేషన్, ఉబరైజేషన్‌కు నూరు శాతం వెళ్లాలి..

నూరు శాతం మెకనైజేషన్, నూరు శాతం ఉబరైజేషన్‌కు వెళ్లాలి. ఉబరైజేషన్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి వ‌స్తుంది. రైతులకు సేంద్రియ ఎరువుల కొరత తీరుతుంది. వ్యవసాయ దిగుబడులు పెరుగుతాయి. అందరి భాగస్వామ్యంతో జలసంరక్షణ, నీరు-ప్రగతి విజయవంతం. కర్నూలులో భూగర్భజలాలు 6మీటర్లు పెరగడం ‘నీరు-ప్రగతి’ విజయమే. భూగర్భజల మట్టం 21 మీటర్ల నుంచి 15 మీటర్లకు పెరిగింది. ఈ ఏడాది నరేగా లక్ష్యం రూ.8వేల కోట్ల పైబడి చేరుకోవాలి. లేబర్ కాంపోనెంట్‌లో, వందరోజుల పనిలో ప్రకాశం జిల్లా ముందు ఉండటం హర్షణీయం. ఎవరెవరు వెనుకబడ్డారు, ఎవరు చేయగలుగుతున్నారు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది ప్ర‌తి వారం విశ్లేషించాలి. వాటిని అధిగమించాలి, భవిష్యత్తుకు సన్నద్ధం కావాలి. గత ఏడాది ఎంత సాధించాం అనేది బెంచ్ మార్క్‌గా  తీసుకోవాలి. రాబోయే ఏడాది లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించుకోవాలి. నెలవారీ, క్వార్టర్లీ ప్రగతిని విశ్లేషించాలి. విజయవాడ -గన్నవరం విమానాశ్రయం రహదారి సుందరీకరణ బాగా చేశారు. ఇదే తరహాలో గుంటూరు వరకు సుందరీకరణ చేపట్టాలి. దీనిని నమూనాగా తీసుకుని అన్ని జిల్లాల్లోనూ రహదారుల సుందరీకరణ చేపట్టాలి. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఎక్కడికక్కడ చలివేంద్రాలు నిర్వహించాలి. వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలి.

Just In...