Published On: Tue, Oct 1st, 2019

ఈ నెల 15న జరగనున్నకేఎల్‌యు ‘ఇన్నోవేషన్ డే’

* మంత్రి మేకపాటికి ఆహ్వానం ప‌లికిన యూనివ‌ర్శిటీ ప్ర‌తినిధులు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధుల బృందం సచివాలయంలో సమావేశమైంది. ఈ నెల 15వ తేదీన ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత ఏ.పీ.జె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్ డే’కు రావాలని మంత్రికి వారు ఆహ్వానం పలికారు. సరికొత్త ఆలోచనలు, ఉత్సాహం నిండిన ఊహలతో ముందుకు వచ్చే యువతకు అనుభవజ్ఞులైన నిపుణులతో సలహాలు ఇప్పించి వారి ఉజ్వల భవిష్యత్ కి బాటలు వేస్తోన్న విశ్వవిద్యాలయం కృషిని మంత్రి మేకపాటి అభినందించారు. విద్యార్థి దశ నుంచే విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా మారే ఆలోచనలున్న యువతకు సహకారం అందించాలన్నారు. యువతీ యువకులను భాగస్వామ్యం చేసి వినూత్న ఆలోచనలతో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. యువతీ, యువకులకు పెద్దపీట వేయడానికే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం ప్రభుత్వం తెచ్చిందని మంత్రి మేకపాటి విశ్వవిద్యాలయం ప్రతినిధులకు వెల్లడించారు.

Just In...