Published On: Sat, May 12th, 2018

ఈ నెల 25కల్లా రుతుపవనాల రాక!

సెల్ఐటి న్యూస్‌, న్యూఢిల్లీ: రుతుపవనాలు ఈ నెల 25కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ శాఖ పరిశీలిస్తున్న వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేష్ మాత్రం ధ్రువీకరించలేదు. ముందస్తు రుతుపవనాల గురించి ప్రసారసాధనాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తమ దృష్టికీ వచ్చిందని, అయితే తాము దీనిపై ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రకటన చేస్తామన్నారు. అంతవరకూ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ఆయన ‘ఈనాడు’తో పేర్కొన్నారు. సాధారణంగా జూన్‌ 1న రుతుపవనాలు తీరాన్ని తాకుతుంటాయి. గాలి గమనంలో మార్పులు, దక్షిణాది రాష్ట్రాల్లో ముందస్తుగా వర్షాలు మొదలవడం లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రుతుపవనాలు ముందుగానే తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు కొందరు పేర్కొంటున్నారు. మే 25-జూన్‌ 7 మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పుతీర రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నైరుతి రుతుపవనాలు మే 30వ తేదీన కేరళ తీరాన్ని తాకిన విష‌యం విధిత‌మె.

Just In...