Published On: Wed, Dec 5th, 2018

ఈ నెల 27న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

* జ్ఞాన‌భేరి స‌భ‌లో సీఎం చంద్రబాబు నాయుడు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, కడప: కేంద్రం ఏమాత్రం సహకరించకపోయినా అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. క‌డ‌ప‌లోని యోగి వేమన యూనివర్సిటీలో మంగ‌ళ‌వారం విద్యార్థులతో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా కేంద్రం అడ్డుపడుతున్నా రెండంకెల వృద్ధి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు. కడపలో కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదని, అందుకే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెల 27న కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నామని పేర్కొన్నారు. ‘‘ఒక్క రూపాయి లేకుండా రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. అమరావతిలో ఏడాదికి రూ.6వేల కోట్లు కేంద్రానికి పన్నులు కడుతున్నాం. అలాంటి రాజధానికి సహకరించాల్సిన కేంద్రం దాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతోంది. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంటున్నారు. అందుకే ఈ నెల 27న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనం చేస్తాం. రామాయపట్నం పోర్టు కూడా మనమే అభివృద్ధి చేస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా ముందుకెళుతున్నాం. ఒక అందమైన రాజధానిని నిర్మించుకుంటున్నాం. అసెంబ్లీ ఒక ఐకానిక్‌ భవనగా తయారవుతోంది. గూగుల్‌ ఆఫీస్‌ కంటే మిన్నగా సచివాలయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వడానికి ప్రయత్నిస్తున్నాం. నీటి కొరత రాకుండా చూసుకునేందుకు నదులను అనుసంధానం చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. తాను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఐఏఎస్‌ అవుదామని అనుకున్నానని, ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని సీఎం త‌న ప్ర‌స్థానాన్ని వివ‌రించారు.
 

Just In...