Published On: Fri, May 11th, 2018

ఈ నెల 30, 31న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

సెల్ఐటి న్యూస్‌, న్యూఢిల్లీ: ఈ నెలాఖరున రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా ఈ నెల 30, 31న సమ్మె చేయనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ శుక్ర‌వారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో రెండ్రోజులపాటు సేవలు నిలిచిపోనున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు మే30 నుంచి 48 గంటల పాటు సమ్మె చేపట్టనున్నారని ఆల్ ఇండియా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాని పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. మే 30న ఉదయం ఆరు గంటల నుంచి జూన్‌ 1 ఉదయం ఆరు గంటల వరకూ ఈ సమ్మె జరగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌ వెల్లడించింది. 2017 నవంబర్‌ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసును బ్యాంకు యాజమాన్యానికి సంబంధించిన అసోసియేషన్‌(ఐబీఏ)కు, చీఫ్‌ లేబర్ కమిషనర్‌(సెంట్రల్)కు అందించినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీ.హెచ్‌ వెంకటాచలం వెల్లడించారు. యూఎఫ్‌బీయూకు, యాజమాన్య సంఘానికి మధ్య మే 5న వేతన సమీక్షకు సంబంధించి సమావేశం జరిగింది. యూఎఫ్‌బీయూ కింద బ్యాంకింగ్ రంగానికి చెందిన తొమ్మిది యూనియన్లు ఉన్నాయి. సమావేశం అనంతరం వారు ఎటువంటి అంగీకారానికి రాలేదు. దీంతో ఏఐబీఈఏ సమ్మె నోటీసులు ఇచ్చింది. నవంబరు 1, 2017కల్లా వేతనాల సమీక్షను పూర్తిచేయాలని ప్రభుత్వం గతంలోనే బ్యాంకు యాజమాన్యాలకు సూచించింద‌ని కానీ వారు దాన్ని జాప్యం చేస్తున్నారని వెంకటాచలం తెలిపారు.

Just In...