Published On: Tue, Apr 17th, 2018

ఉచిత ఇసుక‌కు కృత్రిమ కొర‌త సృష్టిస్తే క్రిమిన‌ల్ కేసులు

* ఇప్పటికే నిబంధ‌నలు ఉల్లంఘించిన వారిపై 17 కేసులు నమోదు

* కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం హెచ్చ‌రిక‌

* ఫెర్రీ వద్ద ఇసుక రీచ్‌ను ప‌రిశీల‌న 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఉచిత ఇసుకను అధిక ధరకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు  తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద బోట్‌మెన్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను సోమవారం ఉద‌యం కలెక్టర్ లక్ష్మీకాంతం స్వ‌యంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహ‌కుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క బోటులో 21 కూబిక్ మీటర్లు ఇసుకను రోజుకు రెండు నుండి మూడు ట్రిప్పులు తవ్వి తీయవచ్చ‌ని ఈ సంంద‌ర్భంగా నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. గృహ సంబంధమైన నిర్మాణాలకు వారి చిరునామాతో పాటు ఆధార్ ఆధారంగా వారి ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నామన్నారు. రోజుకు 100 లారీలు లోడ్‌ను ఫెర్రీ నుండి సరఫరా చేస్తున్నామ‌ని, విస్సన్నపేట, నూజివీడు, మైలవరం మండల గ్రామాలకు సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం క‌లెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇసుక అందుబాటు ధర ఉండేలా కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి గృహ అవసరాలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇసుక రీచ్ నుండి పూడికతీత ఇసుక లోడింగ్ చేసేందుకు ఆరు క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల లారీకి రూ.800లు, ట్ట్రాక్టర్‌కు రూ.400లు, ఐదు కిలోమీటర్లు నుంచి పది కిలోమీటర్ల వరకు రూ.1100 అని తెలిపారు. కిలోమీటరు దాటితే రూ.85 రవాణాగా జాయింట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు పోలీస్, గనుల శాఖ అధికారులతో కమిటీ నివేదిక ఆధారంగా ధరలు నిర్ణయించామని తెలిపారు. క‌త్రిమ కొరత సృష్టించినా, అధిక ధరకు విక్రయించిన, నిబంధనలు ఉల్లంఘించిన, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు ఇప్పటికే నిబంధ‌నలు ఉల్లంఘించిన వారిపై 17 కేసులు నమోదు చేశామన్నారు ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహించి ఉచిత ఇసుక విధానాన్ని సమీక్షిస్తున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, లక్ష 20 వేల గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు జక్కంపూడి ఎకనామిక్ సిటీలో 28 వేల గృహాలు, అర్బన్‌లో 40 వేల గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇసుక రీచ్‌ల నుండి లారీలు ప్రయాణించే మార్గంలో దుమ్ము ధూళి లేకుండా వాటరింగ్ చేయాలని ఈ సంద‌ర్భంగా రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రీచ్‌ను పరిశీలించిన వారిలో జెసి-2 పి.బాబురావు, తహసిల్దార్ కట్టా శివయ్య, మైనింగ్ ఏడి కె.సుబ్రహ్మణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...