Published On: Tue, Apr 17th, 2018

ఉద్యోగావకాశాల‌ కల్పనలో జిల్లా అగ్రస్థానం..

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వీడ్కోలు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులంద‌రికీ ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని, ఇప్పటివరకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో శిక్షణ పూర్తి చేసుకుని చెన్నైలోని రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో చేరేందుకు బయలుదేరిన అభ్యర్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం త‌మ విడిది కార్యాల‌యం నుండి జెండా ఊపి బ‌స్‌ను ప్రారంభించారు. అనంత‌రం కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ నగరంలోని జక్కంపూడి, భవానీపురం, జోజినగర్, కరెన్సీనగర్‌లోని శిక్షణా కేంద్రాల్లో సుమారు 300 మంది శిక్షణ పొందారని తెలిపారు. వీరిలో 108 మంది ఎంపిక కాగా తొలివిడత 50 మంది ఉద్యోగంలో చేరేందుకు చెన్నై బయలుదేరి వెళుతున్నారన్నారు. వీరికి రూ.8,500 వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు సంబంధిత సంస్థ యాజ‌మాన్యం త‌ర‌ఫున కల్పిస్తారన్నారు. ప్రతి మూడు నెలలకు వారి వేతనం పెరుగుతుందని పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3,925 మందికి శిక్షణ లక్ష్యం కాగా 3,187 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని కలెక్టర్ వెల్ల‌డించారు. కార్యక్రమంలో డిఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ చంద్రశేఖరరాజు, జాబ్ డిస్ట్రిక్ మేనేజరు బి.శ్రీనివాస్, డిఆర్‌డిఎ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...