Published On: Tue, Nov 5th, 2019

ఉద్యోగులకు బకాయి ఉన్న కరువు భత్యాలను వెంటనే మంజూరు చేయాలి

* వేతన సవరణ నివేదికను తక్షణమే సమర్పించేలా చర్యలు తీసుకోవాలి

* ఎన్జీఓ నేతలు విద్యాసాగర్, ఎండి ఇక్బాల్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న మూడు విడతల కరువు భత్యాన్ని వెంటనే మంజూరు చేయడంతో పాటు వేతన సవరణ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం దానిని ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ఎ.పి.ఎన్.జి.ఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.విద్యాసాగర్, ఎం.డి.ఇక్బాల్ డిమాండు చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంగళవారం విజయవాడ గాంధీనగర్ లోని ఎపిఎ్వఓ హెూం నందు పశ్చిమ కృష్ణా మరియు విజయవాడ నగర శాఖ కార్యవర్గ సభ్యులు ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటి వరకు మూడు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయవలసి ఉందన్నారు. ప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకుని డిఏ మంజూరు చేస్తుందని ఉద్యోగులు ఎదురు చూసినా వారికి నిరాశే మిగిలిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతోపాటు ఇతరత్రా ధరలు కూడా పెరగడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని ఉద్యోగుల పక్షాన డిమాండు చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు గతంలో 2013 జూలైలో వేతన సవరణ జరిగిందని తిరిగి 2018 జూలై నుండి పిఆర్ సి అమలుయాల్సి ఉందన్నారు. దీనిపై నియమించిన కమిటీ పిఆర్ సి నివేదిక సమర్పించడానికి గడువు ఒక సంవత్సరం అయినప్పటికీ గడువును పొడిగిస్తూ ఇప్పటికే 17 నెలలు కాలయాపన జరిగిందన్నారు. ఇప్పటికైనా తక్షణమే కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.డి. ఇక్బాల్ మాట్లాడుతూ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించడం పట్ల వేలాదిమంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయడం జరిగిందని అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదన్నారు. సిపిఎస్ రద్దుపై నియమించిన మంత్రుల కమిటీ నివేదికపై చర్యలు తీసుకొని ప్రభుత్వ విధానాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా తమిళనాడు కర్నాటక తదితర రాష్ట్రాలలో వైద్య సహాయం లభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రికి వారి మంత్రివర్గ సహచరులకు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

తహశీల్దారు విజయారెడ్డి హత్య అమానుషం అనాగరిక చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం ..
తెలంగాణా రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దారు విజయారెడ్డి పై దాడిచేసి సజీవదహనం చేసిన సంఘటన అత్యంత హేయమైనదని ఇటువంటి అమానుష అనాగరిక చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఎన్జిఓ నేతలు విద్యాసాగర్ ఇక్బాల్ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరుగకుండా నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులపై దాడికి పాల్పడే ఎటువంటి వారినైనా సహించరాని విషయమన్నారు. విజయారెడ్డి మృతిని తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు రెండు నిమిషాలపాటు మౌనం వహించి ఉద్యోగుల పక్షాన నివాళులర్పిస్తున్నామని ఆమె కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రమేష్, ఎం.రాజుబాబు, ఆర్.హెచ్.ప్రకాష్, సి.హెచ్.దిలీప్‌కుమార్, సిహెచ్ అప్పారావు, ఎన్.హేమకళ్యాణి, నగర శాఖ కార్యవర్గ సభ్యులు కోనేరు రవి, జె.స్వామి, బి.సతీష్‌కుమార్, కె.సంప‌త్‌కుమార్, బి.వి.రమణ, వి.వి.ప్రసాద్, సిహెచ్ మదుసూదనరావు, ఎస్.కె.నజీరుద్దీన్, బి.విశ్వనాద్, ఎంవి.రామరాజు, సిహెచ్.రమణ, బి.రాజాచౌదరి, కె.శివశంకర్, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Just In...