Published On: Fri, Apr 5th, 2019

ఎక్సైజ్ సీసీసీ పనితీరు ముదావహం

* ఎన్నికల పరిశీలకుడు రాజన్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సజావుగా ఎన్నికలను నిర్వహించే క్రమంలో ఎక్సైజ్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయటం ముదావహమని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు రాజన్ అభిప్రాయపడ్డారు శుక్రవారం తన పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఇక్కడి సెంటర్ పనితీరు గురించి  కంప్యూటర్స్ విభాగపు డిప్యూటీ కమిషనర్ రేణుక వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోలు, బ్రివరీలు, డిస్టిలరీలను నేరుగా ఇక్కడి నుండే పర్యవేక్షించే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు అక్కడి వ్యవహారాలను  అత్యాధునిక సీసీ కెమెరాల సహాయంతో స్వయంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే చూడగలుగుతామని రేణుక  ఎన్నికల పరిశీలకుడికి వివరించారు. ఎక్సైజ్ శాఖ ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన సిఎఫ్ఎంఎస్ విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదును పరిష్కరిస్తున్న క్రమాన్ని రేణుక ఆయనకు  ప్రత్యక్షంగా చూపారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన రాజన్ మంచి వ్యవస్థను తీసుకువచ్చారని ఎక్సైజ్  శాఖను అభినందించారు. తమ సిబ్బంది కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 24 గంటలు  విధులలో ఉంటున్నారని, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను సైతం పరిశీలిస్తూ కమీషనర్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలకు ఉపక్రమిస్తునామని కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు స్పష్టం చేశారు. తొలుత రాజన్ భవానీపురం ప్రాంతంలోని ఒక రిటైల్ వైన్‌షాప్‌ను తనిఖీ చేశారు. అక్కడి కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ ద్వారా  చేపడుతున్న విక్రయాలను పరిశీలించారు. విజయవాడ ఎక్సైజ్ సూపరిండెంట్ రమణ మూర్తి ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల నిర్వహణకు సంబంధించి అమలవుతున్న విధానాలను విపులీకరించారు. రాజన్ తన పర్యటనలో భాగంగా లిక్కర్ డిపోలను సందర్శించాలని భావించిన సమయాభావం వల్ల సాధ్యపడలేదు. జమ్ము కాశ్మీర్ కేడర్‌కు చెందిన రాజన్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని లుధియనాలో సెంట్రల్ ఎక్సైజ్ అధికారిగా ఉన్నారు.

Just In...