Published On: Tue, Jun 18th, 2019

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరు ఇకపై డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంగా మార్పు

* కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బి.అవినాష్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరును డాక్ట‌ర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌గా పేరు మార్చుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బి.అవినాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంగా పేర్కొనడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 117 ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వవ‌ర్క్‌ హాస్పిటల్స్‌లో ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో 1057 వ్యాధులకు ఉచిత వైద్య సేవలను పథకం ద్వారా అందిస్తున్నారని, నేడు వాటికి అదనంగా మరో 974 వ్యాధులను ప్రభుత్వం ఈ పథకంలో చేర్చినట్లు ఆయన వివరించారు. మొత్తం 2,031 వ్యాధులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతాయన్నారు. పథకం పేరు మార్పు గురించి జిల్లాలోని అన్ని హాస్పిటల్స్‌కు సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యం ఈ విషయాన్ని గమనించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా పేరు మార్చాలని సూచించారు . పథకం ద్వారా వైద్య సేవలను పొందేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 8333814009 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

పేద రోగుల ప్రాణాలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్ ….
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేలో నిరు పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించి వారి గుండెల్లో  చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గత  ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్.టి.ఆర్ వైద్యసేవగా మార్పు చేసిందన్నారు. పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించేలా నిధులు ఇవ్వకపోవటం, సుమారు ఏడు నెలల పాటు పథకం ద్వారా వైద్య సేవలు అందించిన ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. దీంతో పలు హాస్పిటల్స్ లో వైద్యసేవలను నిరాకరిస్తూ ఉండటంతో కొంత కాలంగా పేద రోగులు ఇబ్బంది పడ్డా రన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  బాధ్యతలు చేపట్టిన వెంటనే పేద రోగుల ఆరోగ్యం పై దృష్టి సారించారన్నారు.  అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 974 వ్యాధులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారు. పథకాన్ని సమర్ధవంతముగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చేర్యాలపై సైతం కమిటీ వేయటం జరిగిందని అవినాష్ తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల వైద్యులు, రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన  పేర్కొన్నారు.

Just In...