Published On: Fri, Nov 9th, 2018

ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగానే వేధించ‌డం మొద‌లుపెట్టారు

* దేవెగౌడ ఆశీస్సుల కోసమే వచ్చా

* ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని తెదేపా అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని విమర్శించారు. గురువారం బెంగళూరు వెళ్లిన ఆయన జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. దేశంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వారితో చంద్రబాబు చర్చలు జరిపారు. పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు కుమారస్వామి, దేవెగౌడ ఘన స్వాగతం పలికారు. వీరిమధ్య సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. అనంతరం ముగ్గురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చెప్పారు. మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయ‌ని, భాజపాయేతర కూటమి ఏర్పాటుకు ఆయన మద్దతు కోరామని తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగానే తమను వేధించడం మొదలుపెట్టారని చంద్రబాబు కేంద్రంపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు భాజపాకు వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్ఓనారు. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వివరించారు. శుక్ర‌వారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు.

Just In...