Published On: Sat, May 18th, 2019

ఎన్నికల కమిషన్‌పై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఎన్నికల కమిషన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో టీడీపీ నేతలు, మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 19 చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. భారతదేశంలో ఎన్నికల కమిషన్ బిజేపి కమిషన్‌గా మారిపోయిందన్నారు. ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తితో నిబంధనల మేరకు వ్యవహరించే ఈసీ ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించేదని ఆయన గుర్తు చేశారు.
పోలింగ్ కోసం మేము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదు. ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో ప్రధాని కార్యాలయం ద్వారా ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నారు. విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. చంద్రగిరిలో ఓటమి భయంతో వైసీపీ పీఎంవో ద్వారా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయించారు. పోలింగ్ జరిగిన నలభై రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం దేశ చరిత్రలో తొలిసారి. బీజేపీ యేతర పార్టీలను ఏదో విధంగా ఓడించాలని మోదీ అనేక కుట్రలు చేస్తున్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ద్వివేదీల పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐదు కేంద్రాలలో రీపోలింగ్‌కు ఆదేశించారు. మేము 19 చోట్ల రీపోలింగ్ పెట్టాలని మేము అడిగితే ఇంతవరకు స్పందించలేదు. ఎన్ని కుట్రలు చేసైనా, డబ్బు పంచైనా ఆ ఐదు కేంద్రాలలో తమకు అనుకూలంగా మలచుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలతో రీపోలింగ్ చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. సుబ్రహ్మణ్యం ఇప్పటికైనా స్పందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మేము కోరిన విధంగా 19 చోట్ల కూడా రీపోలింగ్ చేపట్టాలి అని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.

Just In...