Published On: Tue, Mar 12th, 2019

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి

* ప్రతి పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి

* ఈ నెలాఖరుకు రెండు విడతల శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయండి

* ఓటర్లు డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా నిఘాను పెంచాలి

* ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి

* ప్రతి ఓటరు స్వేచ్చగా తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలి

* కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తుచ తప్పక పాటించండి

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏప్రియ‌ల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి ఓటరు తన ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. రానున్న సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం అమరావతి సచివాలయం నుండి కలక్టర్లు, ఎస్పిలతో ఆయన దృశ్య శ్రవణ(వీడియో) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నిర్వహణలో ప్రతి అధికారి, ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్చగా, శాంతియుతంగా జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనే నమ్మకాన్ని అటు ఓటర్లలోను, ఇటు రాజకీయ పార్టీలకు కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోను తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంపులు నిర్మించి ఉంచాలని సిఎస్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి జారీ అయిన అన్ని రకాల ఆదేశాలను తుచ‌ తప్పక పాటించి అవి సక్రమంగా అమలు జరిగేలా అవసమరైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈవిషయంలో కలక్టర్లు,ఎస్పిలు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ ఆదేశించారు.మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో సమీక్షించే వీలుందని సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు. పరిపాలన, సాంకేతిక వంటి అంసాల్లో మన యంత్రాంగం ఎంతో మెరుగైన రీతిలో పనిచేస్తున్నట్టుగానే ఎన్నికల నిర్వహణలో కూడా మెరుగైన రీతిలో పనిచేశారనే పేరు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకింత భావంతో పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా కృషి చేయాలని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ అంతర్ జిల్లా, రాష్ట్ర చెక్ పోస్టులను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పిలు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నూరు శాతం ఆయుధాలు పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసమరైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని ఎస్పిలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు నిర్వహించుకునే ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు జారీలో నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, ఇతర వస్తువుల పంపిణీని నియంత్రించి ఎన్నికల ప్రవర్తణా నియమావళి సక్రమంగా అమలు అయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ విషయంలో కలక్టర్లు, ఎస్పిలు సమన్వయంతో పనిచేయాలని డిజిపి ఆదేశించారు. రానున్న సాధారణ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రానికి 90 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు (సిపిఎంఫ్) రానున్నాయని వాటిని మావోయిస్టు ప్రబావిత, ఇతర అత్యంత సమస్యాత్మక తదితర ప్రాంతాల్లో వారి సేవలను వినియోగించేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నాటి నుండే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపధ్యంలో అధికారికంగా నిర్వహించే వెబ్‌సైట్ల‌లో రాజకీయ ప్రముఖుల పొటోలను వెంటనే తొలగించాలని కార్యదర్శులు, శాఖాధిపతిలు, కలక్టర్లును కోరారు.అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ పబ్లిక్ ఆస్తులకు సంబంధించిన భవనాలు, ప్రాంగణాల్లో ఎలాంటి హోర్డింగ్లు, పోస్టరు వంటివి లేకుండా చూడాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ చివరి గడువని ఆలోగా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారమ్-6 ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. పోలింగ్ ప్రక్రియపై వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహణకు సంబంధించిన రేట్లను ఖరారు చేయడం జరుగుతోందని ఆప్రకారం అవసరం మేరకు వాటిని సమకూర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జనవరి తర్వాత ఓటర్లుగా నమోదుకు ధరఖాస్తు చేసుకున్న వారికై 20లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి జిల్లాలకు పంపండం జరుగుతోందని అవి సక్రమంగా పంపిణీ అయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలు, వివిప్యాట్లకు సంబంధించి సిబ్బంది తగిన శిక్షణను ఇవ్వాలన్నారు. ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి రోజువారీ నివేదికలను సమర్పించాలని కలక్టర్లను సిఇఓ ద్వివేది ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, ఆర్ఓ, ఎఆర్ఓల నియమావకం, మెజిస్టీరియల్ అధికారాలు వంటి అంశాలల్లో త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనలు తదితర కార్యక్రమాలను కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. స‌మావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్‌మోహన్ సింగ్, డి.సాంబశివరావు, పూనం మాలకొండయ్య, శాంతి భద్రతల అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్ధిక, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు డాక్ట‌ర్ కెఎస్ జవహర్ రెడ్డి, యం.రవిచంద్ర, ఎఆర్ అనూరాధ, ఎక్సైజ్ శాఖ కమీషనర్ ఎం.కె.మీనా, అదనపు సిఇఓలు సుజాతా శర్మ, వివేక్ యాదవ్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఐజి జిహెచ్‌పీ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Just In...