Published On: Mon, Mar 11th, 2019

ఎన్నికల ప్రవర్తన నియమావళి షూరు

* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

* రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉందన్నారు. మార్చి 15 వరకు ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ సహకరించి ఫారం-6 సమర్పించాలని కోరుతున్నామని, రాజకీయ పార్టీలు కూడా తమ వంతుగా ప్రజలలోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాలన్నారు. అర్హత గల ఏ ఒక్క ఓటు తొలగించడం జరగలేదని వివరించారు. మార్చి 10వ తేదీ తర్వాత ఓట్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించినా, ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ తర్వాత మాత్రమే వాటిని పరిశీలించి వాస్తవమైతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్చి 10వ తేదీకి ముందు వచ్చిన డిలీషన్స్ (తొలగించాల్సిందిగా) ఫారం–7 ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని తొలగించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఫారం-7 ద్వారా 7.5 లక్షల దరఖాస్తులు రావడం జరిగిందని , వాటిపై విచారణ చేపట్టి 5.5 లక్షల దరఖాస్తులు తిరస్కరించామన్నారు.   తొలగింపుకు సిఫార్సు చేసిన వాటిలో మరణించిన, డూప్లికేట్ ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు వాటి తొలగింపునకు సీఇఓ ద్వారా అంగీకారాన్ని తెలియజేశామన్నారు.  మార్చి 26 వ తారీఖున ఓటర్ల తుది జాబితా సప్లిమెంటరీ కాపీని అందుబాటులో ఉంచుతామన్నారు.
                    ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుగుణంగా అభ్యర్ధులు నియమాలను పాటించాలని, రాజకీయ పార్టీల ఖర్చులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులకు మార్గదర్శకాలను జారీచేశామన్నారు. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపైన అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రజలు స్పందించి ఫిర్యాదులు తెలియ చేయడానికి సి-విజిల్ యాప్ అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని తెలిపారు.  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమిస్తే కఠినంగా వ్యవరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం చేసే ప్రచార సామాగ్రి, తదితర ఖర్చులను వారి ఖాతాలో చూపడం జరుగుతుందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.  మార్గదర్శకాలు అతిక్రమిస్తే సంబంధిత రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఖర్చులను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలలో ఎమ్ సిసి కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. పార్టీలు చేసే ఖర్చుల లెక్కలను ఆయా సందర్భాలు బట్టి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు అవ్వగానే ఖర్చులను వారి ఖాతాకు చూపడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియా, ఫేస్ బుక్, ట్విట్టర్, టివి ఛానల్, వెబ్ ఎడిషన్, పత్రికలు తదితర మాధ్యమాలలో ప్రసారమయ్యే,  ప్రచురించే అనుకూల వార్తలను పెయిడ్ న్యూస్¬గా పరిగణించడం కోసం అందుకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. అత్యంత ప్రభావిత క్రిటికాలిటీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చిత్రీకరణ చేపట్టడం జరుగుతుందని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఎన్నికల ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఓటు లేని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి : సీఇఓ, గోపాలకృష్ణ ద్వివేది…
రాష్ట్రంలో ఓటు లేని వారి కోసం మార్చి 15వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరు వారి ఓటు ఉన్నదో లేదో మరోసారి చూసుకోవాలని ద్వివేది కోరారు. ఒకవేళ ఓటు లేకపోతే ఫారం-6ను వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటు ఉందో, లేదో voter helpline యాప్¬ ద్వారా గాని లేదా 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నారు. ఓటు లేకపోతే www.nvsp.in (or) voter helpline యాప్ ద్వారాగాని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బూత్ లెవెల్ అధికారికి గాని, సంబంధిత మండల తహసీల్ధార్ గానీ, స్వయంగా ఫారం-6 దరఖాస్తులు అందజేయాలని సీఇఓ కోరారు. ఈ అవకాశం ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుని ఓటు హక్కును పొందవచ్చని ఆయన తెలిపారు. సమావేశంలో అదనపు సీఈఓ వివేక్ యాదవ్, జాయింట్ సీఈఓ డి.మార్కండేయులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.ఎస్.ఆర్ పార్టీకి చెందిన మల్లాది విష్ణు, సీహెచ్ శ్రీనివాసరెడ్డి, సీపీఐ (ఎమ్) నుంచి వై.ప్రభాకర్, వై.వెంకటేశ్వరరావు, సిపిఎం జి.ఓబులేసు, బిజెపి నుంచి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Just In...