Published On: Wed, Apr 17th, 2019

ఎన్నిక‌ల ఫ‌లితాలు అనంత‌రం జ‌గ‌న్ జైలుకే

* దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా జగన్ తీరు

* బదిలీలపై విశాంత్ర ఐఎఎస్‌లు ఎందుకు స్పందించరు

* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రతిపక్షనేత జగన్ తీరు దొంగే…దొంగా, దొంగా అంటూ అరుస్తున్న చందంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల అరాచకాలకు, దాడులకు పాల్పడిన వైసిపి నాయకులు రాష్ట్రంలో శాంతిబధ్రతలు క్షీణించాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్‌ని మంగళవారం కలిసిన అనంతరం మీడియాతో వైఎస్ జగ‌న్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ప్రతిపక్షనాయకుడు మాట్లాడే భాష అది కాదన్నారు.  విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం ఏ జైలుకు వెళ్లాలనేది జగన్ నిర్ణయించుకోవాలన్నారు. ఓటేసిన మరుక్షణమే మాయమై లోటస్ పాండ్ కు చేరుకున్నాడని, ప్రెస్ మీట్ లో తన ఓటమిని అంగీకరించాడని చెప్పారు. 40 మంది డిఎస్పీల పదోన్నతుల విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జగన్ కు స్పష్టత ఉంటే వారి పేర్లు, పదోన్నతులు కల్పించిన తేదీలను ప్రకటించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న స్పీకర్ కోడెలపై దాడి జరిగితే 16వ తేదీన చొక్కాలు చించుకున్నారని జగన్ పేర్కొనడం సరైంది కాదన్నారు. చొక్కాలు చించుకునే సంస్కృతి వైసిపిదేనన్నారు. పోలింగ్ పూర్తయిన నాటి నుంచి ఓటమి ఖాయమని గ్రహించి నీరసించిన జగన్ బిజెపి మద్దతుతో మళ్లీ కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మైలవరంలో 44 ఇవిఎంలు సక్రమంగా పని చేయలేదన్నారు.  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా చాలా చోట్ల మధ్యహ్నం 3 గంటల వరకూ ప్రారంభం కాలేదన్నారు. 7 సెకన్లు కనిపించాల్సిన వివి పాట్ స్లిప్లు 3 సెకన్లు మాత్రమే కనిపించాయన్నారు. ఆర్ధిక నేరగాళ్లు జగన్, విజయసాయిరెడ్డి ఫిర్యాదులపై స్పందించి సిఎస్, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులను ఇసి బదిలీ చేసినప్పుడు రిటైర్డు ఐఎఎస్ లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సిఎం చంద్రబాబుపై బురద జల్లుతున్నారని చెప్పారు. ఇన్ని కుట్రలు జరుగుతుంటే, హైదరాబాదులో ఉండి ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవ చేశారు. బాధ్యతా యుతమైన పదవులు నిర్వహించి కులానికి, మతానికి మద్దతు ఇవ్వడం, ఆర్ధిక నేరగాళ్లకు సహకరించడం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇసి తీరుతో ఓటర్లు అవస్థలకు గురైతే, పోలింగ్ సక్రమంగా జరిగిందని జగన్ ప్రకటించడం ఇసికి జగన్ మద్దతు ఇస్తున్నారనేది స్పష్టమవుతుందని తెలిపారు. ప్రజలు ఆరు గంటలకు పైగా లైన్లో ఉండి ఓటు వేశారంటే ఆర్ధిక నేరస్తులను, క్రిమినల్సును అధికారంలోకి రానీయకూడదనే లక్ష్యంతో ఉండటమే ఇందుకు కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్వయిజరీ కమిటీ బుధవారం ప్రాజెక్టును సందర్శించిందని, ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడే పరిస్థతిలో కమిటీ సభ్యులు లేరన్నారు. జగన్ తీరు దూకుడు సినిమాలో బ్రహ్మనందం రియాల్టీ షో తరహాలో ఉందన్నారు. లోటస్ పాండ్ లో సిఎం సార్ అని పిలిపించుకుంటున్నారని తెలిపారు. పతిపక్షనేత బ్రమల్లో బ్రతుకుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆర్ధిక నేరస్తుని చుట్టు పదవులు రానివారు, పదవులు అనుభవించినవారు చేరారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపికి ఈ ఎన్నికల్లో ఆ స్థానం లభించదని చెప్పారు. జగన్ నుంచి రూ.300 కోట్లు పొందిన పీకే చివరికి అతని చేతిలో సిఎం నేమ్ బోర్డు పెట్టి వెళ్లిపోయాడని తెలిపారు. పోలింగ్ రోజున సిఎం చంద్రబాబు చేసిన విన్నపానికి రాష్ట్రంలో మహిళలంతా స్పందించారని, అర్ధరాత్రి వరకూ వేచి ఉండి ఓటు వేశారని తెలిపారు. ప్రతిపక్షనేత జగన్ ఈర్ష్య, అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నాడని తెలిపారు. అతను చేసిన పాపాలకు ఐఎఎస్ అధికారులు జైలు పాలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని చెప్పారు. క్రిమినల్ విజయసాయిరెడ్డిని ఎంపి చేసి పిఎంవోలో కూర్చోపెట్టి పిఎంతో కలిసి కుట్రలు చేస్తున్నాడని తెలిపారు. మే 23 ప్రజల తీర్పుతో జగన్ శంకరగిరి మాన్యాలు పట్టనున్నాడని, ఇందుకు మానసికంగా సిద్ధం కావాలన్నారు. మోడీ, కేసిఆర్, జగన్ మైండ్ గేమ్ ప్రకారమే రిటైర్డు ఐఎఎస్ అధికారులు గవర్నర్ను కలిశారని తెలిపారు. 25 లక్షల ఓట్లు గల్లంతైతే ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పి సరిపెట్టిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోని వివి పాట్ స్లిప్లును ఇప్పటికీ లెక్కించలేదన్నారు. నియంత మోడీ దేశంలోని వ్యవస్థలను అన్నింటినీ బ్రస్టు పట్టించారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో ప్రతిపక్ష నేతలపై ఐటి దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మొదటి దశ పోలింగ్ లో జరిగిన అవకతవకలను దేశ ప్రజలు, జాతీయ, ప్రాంతీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లడంలో సిఎం చంద్రబాబు విజయవంతం అయ్యారన్నారు. రాష్ట్రంలో 888 మిల్లీ మీటర్లకు, 598 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంద‌న్నారు. ఇప్ప‌టి వరకూ 359 టిఎంసిల భూగర్భజలాలను వినియోగించడం జరిగిందన్నారు. వర్షాలు పడే వరకూ తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తప్పని సరి పరిస్థితి అయితేనే ప్రజలు బయటకు వెళ్లాలన్నారు.

Just In...