Published On: Thu, Aug 8th, 2019

ఎపిడిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయండి

* సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

సెల్ఐటి న్యూస్, అమరావతి: ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఎపిడిఆర్పి)కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలో ఇందుకు సంబంధించి సిఎస్ అధ్యక్షతన సమావేశం(Warp-up)జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ…. 68 శాతం ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయం 250 యుఎస్ మిలియన్ డాలర్లు, 32 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 120 యుఎస్ మిలియన్ డాలర్లు మొత్తం 2వేల 220 కోట్ల రూ.లు అంచనాతో ఇప్పటికే 1813 కోట్ల రూ.లకు పరిపాలనామోదం ఇచ్చి 6 కాంపోనెంట్లు గా చేపట్టిన వివిధ పనులను 5 ఏళ్ళ కాలవ్యవధిలోగా అనగా వచ్చే ఏడాది సెప్టెంబరు నెలాఖరు లోగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే సుమారు 700 కోట్ల రూ.లు వరకూ ఖర్చు చేయగా మిగతా పనులను నిర్ధిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎపిఇపిడిసిఎల్, పంచాయితీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, రోడ్లు భవనాలు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, వుడా, ఎపి ఫారెస్ట్ అండ్ పిఎంయు విభాగాల ఆధ్వర్యంలో ఆరు కాంపోంనెంట్లలలో వివిధ దశల్లో జరుగుతున్న పనులను ప్రగతికి సంబంధించి ప్రతి 15 రోజులకు తనకు నివేదిక సమర్పించాలని ఈ ప్రాజెక్టు సభ్య కార్యదర్శి మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కమీషనర్ కె.కన్నబాబును సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనుల వేగవంతం చేసేందుకు వీలుగా సంబంధిత శాఖల సిఇలతో ఒక కమిటీవేసి అన్ని అంశాలను చర్చించాలని అలాగే ఇఏపి ప్రాజెక్టులకు(ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు)జిఎస్టికి సంబంధించిన అంశాలపై కూడా సిఇలతో కమిటీ వేసి వెంటనే అన్ని అంశాలను చర్చించుకుని సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.అంతేగాక ప్రతి పనికి ఒక నిర్ధిష్ట టైమ్లైన్ పెట్టి ఆప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి విశాఖపట్నంలో సంబంధిత శాఖలు, ఏజెన్సీలతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. అంతేగాక ప్రొక్యూర్మెంట్ ను కూడా ఒక నిర్ధిష్ట వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతకు
ముందు ఎపిడిఆర్పి టాస్క్ ఫోర్స్ టీం లీడర్ దీపక్ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పనుల ప్రగతి, ఇతర అంశాలను వివరించారు. అనంతరం సిఎస్ అధ్యక్షతన ఎపిడిఆర్పి 3వ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్ మెహన్ సింగ్, నీరబ్ కుమార్ ప్రసాద్, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు యం.కృష్ణ బాబు, గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డిజి ఎఆర్ అనురాధ, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, పిసిసిఎఫ్ రిజ్వి, ఎపిడిఆర్పి టాస్క్ ఫోర్స్ టీం లీడర్ దీపక్ సింగ్,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కమీషనర్ కె.కన్నబాబు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, ఎపిఎస్పి బెటాలియన్స్ ఐజి జి.శ్రీనివాస్, పంచాయితీరాజ్, ఆర్అండ్బి, ఎపిఇసిడిసిఎల్, మున్సిపల్ తదితర శాఖల చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Just In...