Published On: Mon, Apr 16th, 2018

ఎఫ్‌టైప్‌ క్వార్టర్స్‌లో త్వరలో భక్తులకు అందుబాటులోకి 70 కాటేజీలు

* టిటిడి తిరుమల జెఈవో కెఎస్ శ్రీనివాసరాజు

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుమలలోని ఎఫ్‌ టైప్‌ క్వార్టర్స్‌లో త్వరలో 70 కాటేజీలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని ఎఫ్‌ టైప్‌ క్వార్టర్స్‌, కాకులకొండ మార్గం, మూడో దశ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులను ఆదివారం సాయంత్రం జెఈవో తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఎఫ్‌ టైప్‌ క్వార్టర్స్‌లో ఎసి సదుపాయంతో కూడిన కాటేజీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు కాకులకొండ వరకు రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడో దశ రింగ్‌రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వీటితో పాటు ధర్మగిరి-శిలాతోరణం జంక్షన్‌ పనులు, ధర్మగిరి వేద పాఠశాల మార్గం అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు. నూతన శ్రీవారి సేవాసదన్‌లో 43 లక్షలతో ఉద్యానవనాలు, పచ్చదనం పెంచేందుకు టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. జెఈవో వెంట టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్స్‌) వేంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ ఫణికుమార్‌ ఇతర అధికారులు ఉన్నారు.

Just In...