Published On: Thu, Nov 29th, 2018

ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి జాయింట్ కమిటీలు తరచూ సమావేశం కావాలి

* గంజాయి సాగు నిరోధానికి వివిధ శాఖల అధికారులతో సంస్ధాగత కమిటీలు ఏర్పాటు

* ఏపి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశం

* స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి

* అధికారుల‌కు డీజీపీ ఆర్పి ఠాకూర్ ఆదేశం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి అవసరమైన సిబ్బంది, వాహనాలు అటవీ శాఖకు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సచివాలయంలో బుధ‌వారం జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటోన్న చర్యలను అటవీశాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. ఇప్పటివరకూ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.1612 కోట్ల ఆదాయం సమకూరిందని వారు సీఎస్‌కు తెలిపారు. మరో 4 వేల టన్నుల ఎర్ర చందనం వేలానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 14,318 టన్నుల ఎర్ర చందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు, 9442 వాహనాలు సీజ్ చేసి, 15,426 కేసులు నమోదు చేశామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 28,760 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టామని సీఎస్‌కు తెలిపారు. పొరుగు రాష్ట్రాల వాహనాల నంబర్లు మార్చి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని, అలాంటి వాహనాల యజమానులను గుర్తించడం కష్టం అవుతోందని సీఎస్‌కు వివరించారు. వాహనాల నెంబర్లను గుర్తించడంలో దురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని రవాణా శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి గుర్తించిన 180 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు, నాకాబందీ, ఫారెస్ట్ మార్చ్‌లు, కూంబింగ్‌లు తరచూ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయుధాలతో కూడిన సిబ్బందితో బేస్ క్యాంపులు నిర్వహిస్తునట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన మూడు ఫ్లటూన్ల సిబ్బంది ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధానికి పనిచేస్తున్నారని అధికారులు సీఎస్‌కు వివరించారు. అటవీ శాఖకు అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని శాశ్వ‌త ప్రాతిపదిక ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఎర్ర చందనం స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేయాలని స‌మీక్ష సమావేశంలో అధికారులను సీఎస్ ఆదేశించారు. గంజాయి సాగు నిరోధానికి తీసుకుంటోన్న చర్యలను అటవీ, పోలీస్ శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. శాటిలైట్ ఇమేజెస్ తీసుకోవడం ద్వారా గంజాయి సాగును గుర్తించి, దాడులు చేసి పంటను ధ్వంసం చేస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 3200 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని ధ్వంసం చేశామని చెప్పారు. గంజాయి పంటను గుర్తించేందుకు డ్రోన్ల సహాయం తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. శాశ్వ‌తంగా గంజాయి సాగును నిరోధించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సంస్ధాగతమైన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గంజాయి విత్తనం రాష్ట్రంలోకి రాకుండా నిరోధించాలని అటవీశాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ, ప్రభుత్వ భూముల్లో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేసేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారం తీసుకోవాలని సీఎస్ సూచించారు.

Just In...