Published On: Wed, Dec 2nd, 2020

ఎల్‌పీజీ డిమాండ్ భర్తీకి రూ.167 కోట్లతో బాట్లింగ్ ప్లాంట్

* రాష్ట్రంలో 49.07 లక్షల మంది వినియోగదారులు

* విజయవాడ పెట్రోలియం స్టోరేజీ టెర్మినల్ పునరుద్ధరణ

* ఇండియన్ ఆయిల్ ఈడీ ఆర్‌.ఎస్‌.ఎస్.రావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ డిమాండ్‌ను సమర్థవంతంగా భర్తీ చేయడానికి చిత్తూరు వద్ద రూ.167 కోట్లతో 120 టీఎంటీపీఎ గ్రాస్ రూట్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణా ష్ట్రాల హెడ్ ఆర్‌.ఎస్‌.ఎస్.రావు అన్నారు. విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020-21 సంవత్సరానికిగాను ఇండియన్ ఆయిల్‌కు ఎల్‌పీజీ మార్కెట్ వాటా 35.5 శాతం ఉందని తెలిపారు. ఇక్కడ వంటగ్యాస్‌లో 259 టీఎంటీ అమ్మకాలు చేసిందని ఈ కాలంలోనే 10 నూతన ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 444 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని వీరంతా ఇండియన్ ఆయిల్ ఇండేన్ ఎల్‌పీజీని 49,07 లక్షల మంది వినియోగదారులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇండియన్ ఆయిల్‌కు రాష్ట్రంలో మూడు ఇండేన్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయని వాటిలో కడప, విశాఖ‌ప‌ట్నం, విజయవాడ (కొండపల్లి)లో ఉన్నాయని తెలిపారు. పీఎంయువై ఖాతాదారుల కోసం ఇండియన్ ఆయిల్ 5 కేజీల డొమెస్టిక్ సిలిండర్లను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 14.2 కేజీల సిలెండర్లు కలిగిన పీఎంయూవై వినియోగదారులు తమ 14.2 కేజీల సిలెండర్లను 5 కేజీల గృహ సిలెండర్లుగా మార్చుకోవచ్చని తెలిపారు. వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ విధానం తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.1689 కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వీటిలో పెట్రోల్ ఉత్పత్తుల మౌలిక వసతులకు రూ.1522 కోట్లు, ఎల్పీజీకి రూ.167 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలోని కొండపల్లి వద్ద నున్న పెట్రోలియం స్టోరేజీ ట‌ర్మినల్‌ను పునరుద్దరించడంతో పాటుగా నిల్వ సామర్థ్యం పెంచడానికి రూ.316 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు. పెట్రోలియం ఇంధనాల డిమాండ్‌ను భర్తీ చేయడానికి ఇండియన్ ఆయిల్ కొత్త టర్మినల్‌ను వైజాగ్ సమీపలోని అచ్యుతాపురం వద్ద 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.466 కోట్లతో నిర్మించనున్నట్లు వెల్ల‌డించారు. విలేక‌రుల స‌మావేశంలో కంపెనీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Just In...