Published On: Sat, Jan 11th, 2020

ఎస్.ఆర్.ఎస్.వి.క‌ళాశాల‌లో అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబరాలు…

* సంప్ర‌దాయ వ‌స్త్రాలు, ఆనందోత్సాహాల న‌డుమ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంద‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఎస్.ఆర్.ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చిట్టూరి పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. విద్యార్థులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా గంగిరెద్దుల ఆట ప్రదర్శించారు. జయ జనార్ధనా కృష్ణా అంటూ సాగే కృష్ణుడి గీతానికి కోలాట ప్రదర్శన చేశారు. బొమ్మలు కొలువు పెట్టి గాలిపటాలు ఎగురవేశారు. బొంగరాలాటలతో పిల్లలు కేరింతలు కొట్టారు. హరిదాసు వేషాలు కట్టిన బాలలు ప్రాంగణమంతా కలియదిరుగుతూ పాటలు పాడుతుంటే సంప్రదాయ వస్త్రాలు ధరించిన పడతులు వారికి బియ్యం, కూరలు, స్వయంపాకం అందించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా అంటూ సాగే జానపదగీతాలకు బీఈడీ, డీఈడీ విద్యార్థులు కోలాటం ఆడారు. సంక్రాంతి పిండివంటలు అరిసెలు, బూరెలు, పులిహర, కేసరి పిండివంటలతో అందరూ విందు ఆరగించారు. ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీలు సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి, చివరగా భోగిమంటలు వేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.బి.ఎన్. కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల వంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. భావితరాలకు మన సంప్రదాయాల్ని అందించటానికి కళాశాలలు, పాఠశాలలు కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. బీఈడీ కళాశాల సెక్రటరీ జి.గంగాధర్, ఎస్.కె.పి.వి.వి. హిందూ హైస్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, చిట్టూరి ఆనందరామ సుధాకర్, కావూరి ఓంకార నరసింహం, చిట్టూరి పబ్లిక్ స్కూల్ హెచ్.ఎం. సుధారాణి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శ్రీనివాసమూర్తి అతిథులుగా పాల్గొని సంక్రాంతి విశేషాలను వివరించారు. ముగ్గుల పోటీల విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కె.రామకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. 

Just In...