Published On: Sat, Jan 12th, 2019

ఏడాదిలోపే ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి

* 800 అడుగుల ఎత్తులో 50 అంతస్థుల్లో అమరావతి అసెంబ్లీ

* దశాబ్దాల సాగునీటి, త్రాగునీటి కొరతకు చరమగీతం పాడదాం

* మైలవరం జన్మభూమి-మాఊరు గ్రామ సభలో మంత్రి దేవినేని ఉమా

సెల్ఐటి న్యూస్‌, మైలవరం: దేశం యావత్తు విస్తుపోయేలా, అన్ని రాష్ర్టాలు అమరావతి వైపు చూసేలా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని శనివారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రూ.13వందల కోట్లతో నిర్మితమౌతున్న కూచిపూడి నాట్యభంగిమ ఐకానిక్ బ్రిడ్జికి పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన జరుగుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మైలవరం పట్టణంలో శుక్రవారం జరిగిన 6వ విడత తుది జన్మభూమి-మాఊరు గ్రామసభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రత్యర్థి వైకాపా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పనులను ఏడాదిలోపే పూర్తయ్యేలా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎనిమిది వందల అడుగుల ఎత్తులో 50 అంతస్తుల భవనాలతో రాజధాని అమరావతి అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. లక్ష కోట్ల అప్పుతో 16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి, కట్టుబట్టలతో సీమాంధ్రులను బెజవాడ పంపారని, ఒక చిన్న చెట్టుకింద బస్సు పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షతను చూసి, అమరావతి రైతులు రెండు పంటలు పండే 34వేల ఎకరాలను రూపాయి కూడా ఆశించకుండా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని చెప్పారు. ప్రజలందరూ ఒకసారి అమరావతి నిర్మాణం పనులను చూసి తరించాలని పిలుపునిచ్చారు. 24గంటల్లో 32100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి పోలవరం నిర్మాణం పనులను దౌడు తీయుస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి రూ.3700కోట్లు ఇవ్వాల్సివుందని, ప్రత్యేకహోదా, విభజన హామీలను పట్టించుకోకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం పట్టారని తెలిపారు. పోలవరం పనులకు ఎన్నో అవార్డులు, రివార్డులు వస్తున్నా గిన్నీస్ బుక్ అవార్డు వచ్చినా వైకాపా పార్టీ నాయకులు పోలవరం పునాదులు లేవలేదని తప్పుడు ప్రచారం చేయటం పట్ల మంత్రి ఉమా ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకాపా నాయకులకు ముఖ్యమంత్రి పీఠంపై ధ్యాస తప్ప, రాష్ర్ట ప్రగతిపై అవగాహన లేదని, అలాంటి అవగాహన లేని నాయకులకు అందలాలు దక్కితే రాష్ర్టం అధోగతి పాలౌతుందని హెచ్చరించారు. జిల్లాలో ఇంటింటికీ కుళాయి పథకం కింద సీఎం 9వందల కోట్లు మంజూరు చేస్తే, మైలవరం నియోజకవర్గానికి రూ.186.91కోట్లు ఇచ్చారని చెప్పారు. కృష్ణా జలాలను మైలవరం తీసుకువస్తానని నేను అంటే నాపై ఏవేవో అవాకులు చవాకులు పేలారని, ఇప్పుడు కుళాయి పనులు పోరాట్ నగర్, కొండపల్లి నుంచి ప్రారంభించగానే వాళ్ల నోళ్లు మూతపడ్డాయని తెలిపారు. వెయ్యి కోట్లు రూపాయలు విలువచేసే నివేశనా స్థలాలను పేదలకు పట్టాలుగా మంజూరు చేస్తుంటే, పట్టాలు తీసుకున్న నిరుపేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని, ఆ ఆనందం నాకు కొత్త ఉత్సహాన్నిస్తుందని చెప్పారు. పూరగుట్టును బద్దలుకొట్టి మరో వెయ్యి మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నానని, దీనిని జీర్ణించుకోలేని వైకాపా పార్టీ వారు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. 33 చెరువులకు 22 కొత్త లిఫ్ట్ లు పెట్టి 7వేల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తున్నట్లు స్పష్టం చేసారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా అభివృద్ధి ఆగదని, అభివృద్ధి రథచక్రాలకు అడ్డుపడితే అధోగతి పాలౌతారని హెచ్చరించారు. తాను పేదల పక్షపాతినని, లేనివాడి పక్షమే ఉంటానని స్పష్టం చేసారు. రాజకీయాలకు, జెండాలకు ఇది సమయం కాదని, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు అస్వాదిస్తున్నారని తెలిపారు. పోలవరం, పట్టిసీమ, చింతలపూడి వంటి చారిత్రాత్మక నిర్మాణాలను చేపట్టే భాగ్యం కలగటం మైలవరం ప్రజల పుణ్యమేనని పదే పదే నొక్కి చెప్పారు. ప్రజల దీవెనలతోనే తన చేతుల మీదుగా రూ.64వేల కోట్లు ఖర్చుపెట్టానని, మైలవరానికి నవంబరులో కృష్ణాజలాలు వస్తే, జూన్, జులై నెలల్లో గోదావరి నీళ్ళొస్తాయని పేర్కొన్నారు. దశాబ్దాల సాగునీటి, త్రాగునీటి కొరతకు చరమగీతం పాడితీరతానని మంత్రి ఉమా ప్రకటించారు.

 

Just In...