Published On: Wed, Apr 17th, 2019

ఏపిలో 66 శాతం దివ్యాంగులు ఓటు హక్కు వినియోగం

* రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి గోపాలకృష్ణ ద్వివేది 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఈ నెల 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో 3,37,259 మంది దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా దృష్టిసారించి ఎక్కువ శాతం మంది దివ్యాంగులు వారి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఆ దిశలో రాష్ట్రంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు క్షేత్ర స్థాయిలో అమలుకు జిల్లా ఎన్నికల అధికారులతో అడుగులు వేశామన్నారు. రాష్ట్రంలో 5,21,029 మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. వీరిలో 3,37,259 మంది (65.80%) వారి ఓటు హక్కును వినియోగించుకోగలిగారన్నారు. సాధారణ ఓటర్లకు ధీటుగా దివ్యాంగ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం మంచి పరిణామమని, ఇది మరింత మందికి స్పూర్తిగా నిలిస్తుందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి 91.11% మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా విజయనగరంలో 47.23% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లాలో 44,115 మంది ఓటర్ల జాబితాలో వివరాలు మార్కింగ్ చేయగా 28,192  మంది (63.90 %) ఓటు హక్కు వినియోగించుకున్నారు.  అదే విధంగా జిల్లాల వారీగా గుంటూరులో 40,921 మందికి గాను 26,552 (64.88 %) మంది, ప్రకాశంలో 35,833 మందికి గాను 26,467 (73.86 %) మంది, ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరులో 35,247 మందికి గాను 25,469 (72.25 %) మంది, విజయనగరంలో 36,418 మందికి గాను 17,201 (47.23%) మంది, విశాఖపట్నంలో 44,163 మందికి గాను 25,116 (56.87%) మంది, తూర్పుగోదావరిలో 55,732 మందికి గాను 29,609 (53.12%) మంది, పశ్చిమగోదావరిలో 44,010 మందికి గాను 28,917 (65.70%) మంది, కృష్ణాలో 36,945 మందికి గాను 24,849 (67.25%) మంది, కర్నూలులో 39,977 మందికి గాను 29,012 (72.57%) మంది, చిత్తూరులో 50,965 మందికి గాను 38,121 (74.79%) మంది, శ్రీకాకుళంలో 29,787 మందికి గాను 27,140 (91.11%) మంది, వై.ఎస్.ఆర్ కడపలో 26,916 మందికి గాను 20,344 (75.95%) మంది దివ్యాంగ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు.
                           రాష్ట్రంలోని వివిధ కేటగిరిలకు చెందిన దివ్యాంగ ఓటర్లను గుర్తించడం కోసం రాష్ట్ర వికలాంగ సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు సుజాత శర్మ అతితక్కువ సమయంలో మ్యాపింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించగలిగామన్నారు. దృష్టిలోపంగల దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో పోటీ చేసే అభ్యర్ధులతో పాటు ఓటర్ల స్లిప్పులను కూడా అందించడం జరిగిందన్నారు.  ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు, వీల్¬ఛైర్¬లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోని దివ్యాంగ ఓటర్లను గుర్తించి ఎన్నికల పోలింగ్ తేదీన ఆయా కేంద్రాలకు వారిని తీసుకువచ్చేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను చేయడంలో సమర్ధవంతంగా విధులను నిర్వహించామన్నారు. దివ్యాంగ ఓటర్లు ఇంత భారీ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడం మంచి పరిణామమని, ఇటువంటి ఫలితాలు మరింత మందికి భవిష్యత్తులో స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

Just In...