Published On: Tue, Sep 22nd, 2020

‘ఏపి పోలీసు సేవ‌’ యాప్‌తో 87 ర‌కాల సేవ‌లు…!

* ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

* ఇక‌పై ఫిర్యాదు యాప్‌లోనే చేసుకునే సౌల‌భ్యం

* ఎఫ్ఐఆర్ ప్ర‌తిని కూడా ఆన్‌లైన్‌లోనే పొందే అవ‌కాశం

* పౌరులకు మరింత మెరుగైన సేవలందిస్తామ‌న్న సీఎం

(అమరావతి బ్యూరోసెల్ఐటి న్యూస్‌): పోలీసులు అంటే సేవకులు, వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వారు కూడా మన కుటుంబసభ్యులే అని భావించి వారిని ఆశ్రయించవచ్చు. ఆత్మవిశ్వాసం పెంచడం కోసం యాప్‌ ఉపయోగపడుతుంది. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, వారికి రోజంతా అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్‌ రూపొందించడం జరిగింది అని ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌) యాప్‌’ను సోమ‌‌వారం తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు.

సిటిజన్‌ ఫ్రెండ్లీ అంటే?:
పోలీసులు అంటే ఒక బలగంగా లేదా ఒక శక్తిగా కాకుండా, సేవలందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్‌ ఫ్రెండ్లీకి అర్ధం. ఇప్పుడు ఈ యాప్‌ ద్వారా పౌరులకు ఆరు విభాగాలలో 87 రకాల సేవలు అందుతాయి.

ఏయే ప్రయోజనాలు:
ఇళ్ల భద్రత మొదలు ఏ అవసరం కోసం అయినా యాప్‌ ఉపయోగపడుతుంది, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం లేదు. మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతుంది.

ప్రధానంగా ఏయే విభాగాలు?:
మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు. రోడ్‌ సేఫ్టీకి సంబంధించి కూడా 6 మాడ్యూల్స్‌ ఉన్నాయి. చిన్న ప్రమాదం జరిగినా, దాన్ని రిపోర్టు చేయడంతోపాటు, ఆస్పత్రికి తరలించే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. సైబర్‌ నేరాలకు సంబంధించి కూడా దాదాపు 15 మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఆ నేరాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య ఉన్నా యాప్‌ ఉపయోగపడుతుంది. చివరకు సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారంలో వాస్తవం ఏమిటన్నది కూడా తెలుసుకోవచ్చు. ‘ఫ్యాక్ట్స్‌ చెక్‌’ అన్న ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలు:
ఇప్పటికే పోలీసు సేవలు గ్రామగ్రామానికి చేరాయి. 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మహిళా పోలీసులను కూడా నియమించాము.వారి ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి. ఈ యాప్‌లో అన్నీ అనుసంధానం చేస్తున్నాం. గ్రామ పోలీసులను ఇందులో అనుసంధానం చేశాం.

దిశ యాప్‌:
దేశంలోనే తొలిసారిగా దిశ యాప్ తీసుకొచ్చాం. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం. దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం.

స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ:
స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ, రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్‌ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్‌ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం. వాటి ద్వారా అన్ని రకాల సేవలు. దేశంలోనే ముందడుగులో ఉన్నారు. ఇది గర్వకారణం.

ఐసీజెఎస్‌:
న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలోనే ‘ఇంటర్‌–ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌’ (ఐసీజెఎస్‌) ప్రవేశపెట్టాం. ఆ విధానం ద్వారా ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.

పోలీసు వ్యవస్థ ఎందుకంటే?:
పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం. నేరాన్ని నిరోధించడం, నేరాలపై విచారణ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, సమాజంలో నేరాలు సున్నా చేయడమే లక్ష్యం. అందుకే ఈ వ్యవస్థ. వారి పని ఇంకా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థ తెచ్చాము. వీలైనంత పారదర్శకంగా వ్యవస్థను మార్చుకోవడం, ఒక ఫిర్యాదు చేయాలన్నా, ఒక ఎఫ్‌ఐఆర్‌ కాపీ పొందాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. ఆ దిశలో పూర్తి పారదర్శకంగా ముందుకు అడుగుల వేస్తేనే సామాన్యులకు మేలు జరుగుతుంది. న్యాయం జరుగుతుంది.

ఎందుకు ఈ యాప్‌?:
ఆ దిశలోనే ఒక అడుగు ముందుకు వేస్తూ, ఇవాళ ఈ యాప్‌ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారా పొందవచ్చు. చట్టాన్ని కాపాడడం కోసమే పోలీసులు అధికారాలు ఉపయోగించాలి. ఈ విషయం మరోసారి గుర్తు చేస్తున్నాను. ప్రజలు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, సేవలు పొందాలి. వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దీని వల్ల ప్రజలకు మంచి జరగాలని దేవుణ్ని కోరుకుంటున్నాను.

ఆ కేసుల కోసం వారోత్సవం నిర్వహించాలి (మేకతోటి సుచరిత. హోం మంత్రి) ‘సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నారు. పోలీసులకు వీక్‌ ఆఫ్‌ ఇచ్చారు. ఇవాళ దాన్ని చాలా రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయి. మహిళల
రక్షణ కోసం దిశ చట్టం చేశారు. ఇది వారికి ఎంతో భరోసా ఇస్తోంది. ఇప్పుడు 6 విభాగాల్లో 87 రకాల సేవలందించేలా యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక ఏ అవసరానికీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేదు. నెల్లూరు జిల్లాలోని ఒక పోలీస్‌ స్టేషన్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ఒక వారోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది’.

పోలీసు చరిత్రలో మర్చిపోలేని రోజు (గౌతమ్‌ సవాంగ్‌, డీజీపీ)
‘ఇవాళ ఏపీ పోలీసు చరిత్రలో మర్చిపోలేని రోజు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక యాప్‌ పోలీస్‌ సేవా అప్లికేషన్‌ ఆవిష్కరిస్తున్నాం. పౌరులకు ఆరు విభాగాలలో మొత్తం 87 రకాల సేవలు అందించే విధంగా యాప్‌కు రూపకల్పన.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలు అందిస్తున్నందుకు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వచ్చాయి’. అనంతరం వివిధ జిల్లాలలోని పోలీస్‌ స్టేషన్ల సిబ్బందితో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కార్య‌క్రమంలో చివరగా పోలీసు ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లను సీఎం జగన్‌ పంపిణీ చేయగా, పోలీసు శాఖ పక్షాన ఒక శాటిలైట్‌ ఫోన్‌ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సీఎంకు అందజేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 కేంద్రాల నుంచి దాదాపు
46 వేల మంది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

అసలు ఏమిటి ఈ యాప్‌?:
దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ, పౌరులు తమ అవసరాల కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా, వారు ఆరు విభాగాలలో మొత్తం 87 రకాల సేవలు పొందేలా ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ అందుబాటులోకి వస్తోంది. పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపైనా ఫిర్యాదు చేయొచ్చు. అంతే కాకుండా ఆ ఫిర్యాదులకు రసీదు కూడా పొందే విధంగా యాప్‌ రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు వ్యవస్థలో ఈ యాప్‌ ఒక విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని కూడా నిర్థారించుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఇంకా ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌ ఉన్నాయి.

 

Just In...