Published On: Wed, Oct 16th, 2019

ఏపి భవన్‌ను ప్లాస్టిక్‌ర‌హితంగా తీర్చిదిద్దాలి

* ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ నిబద్దతతో కృషిచేయాలి  

* ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా

సెల్ఐటి న్యూస్‌, న్యూ ఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నిబద్దతతో కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ భవన్ ఇంచార్జి రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా ఎపి భవన్ అధికారులు, సిబ్బందికి సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అన్ని విభాగాలు, నివాసాలు, భవన ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని, ప్రత్యేకించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని తక్షణమే ఆపివేయాలని  ఎపి భవన్ అధికారులు సిబ్బందితో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భావన సక్సేనా ఆదేశించారు.  ప్లాస్టిక్ వినియోగంతో వ‌చ్చే అనర్ధాలు, పర్యావరణానికి కలిగే నష్టాలు, మానవాళికి కలుగుతున్న ముప్పు, దుష్పరిణామాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సిబ్బందికి వివరిస్తూ అవగాహన కల్పించారు.  ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ భవన్ కార్యాలయాలు, ప్రాంగణం, అతిధిగృహం, అధికారులు, సిబ్బంది నివాస గృహాలలో దశలవారీగా ప్లాస్టిక్ వినియోగాన్ని ఏవిధంగా తగ్గించవచ్చో సోదాహరణంగా విశదీకరించారు.  పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కాంటీన్, షాపులలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్యాకింగ్ మెటీరియల్ వినియోగాన్ని తక్షణమే ఆపివేయాలని ఆదేశించారు.  ప్లాస్టిక్ రహిత  పర్యావరణానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేస్తూ తోటివారికి అవగాహన కల్పించాలని భావన సక్సేనా సూచించారు.  సమావేశంలో ఎపి భవన్ అసిస్టెంట్ కమిషనర్లు డాక్ట‌ర్ కె.లింగరాజు, ఎం.వి.ఎస్.రామారావు, సాయిబాబు, వెంకటరమణ, ఎపిఐసి, లీగల్ సెల్ ప్రత్యేక అధికారులు కె.జయరావు, సరళాదేవి, డిఇఇ రవినాయక్, పర్యటన శాఖ మేనేజర్ జి.రామకోటయ్య, పిఏఓ కృష్ణారావు, ఏఏఓ నాగభూషణం, పలువురు లైజనింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Just In...