Published On: Fri, May 10th, 2019

ఏపీఎస్‌ఆర్టీసీ బకాయిలు రూ.6500 కోట్లు

* ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: డీజిల్ ధరలు పెరగడం ఫ‌లితంగా ఏడాదికి రూ.650 కోట్లు భరించాల్సి వస్తోందని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. ఈ విష‌య‌మై శుక్ర‌వారం ఉద‌యం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  2015-16 ఆర్థిక సంవత్సరంలో  సంస్థకు రూ.735 కోట్లు నష్టం ఏర్పడిందని, 2016-17లో ఇది రూ.789 కోట్లకు చేరిందని తెలిపారు. 2017-18లో రూ1205 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని సురేంద్రబాబు వివరించారు. ఈ ఏడాది పీఆర్సీ, డీజిల్‌ ధరల ప్రభావం ఉన్నప్పటికీ నిబద్ధతతో పని చేసి నష్టాన్ని తగ్గించామని వివరించారు. రుణాల రూపేణా ఆర్టీసీకి రూ.3,380 కోట్ల అప్పులున్నాయని సురేంద్రబాబు అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 20 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఉద్యోగుల భవిష్యనిధి పేరిట 671 కోట్లు జమచేయాల్సి ఉందని వెల్లడించారు. ఇతరత్రా బకాయిలన్నీ కలిపి ఆర్టీసీ రూ. 6500 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను రూపంలో రూ.316 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల వల్ల రూ.1409 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. కాలంచెల్లిన బస్సులు నడిపే పరిస్థితి ఇకపై ఉండదని, 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ మార్చాలంటే మొత్తం 1666 కొత్త బస్సులు అవసరమవుతాయని ఎండీ తెలిపారు.

Just In...