Published On: Tue, Jun 18th, 2019

ఏపీకి ప్ర‌త్యేకహోదా కోసం నిబద్ధతతో ప్రయత్నించాం..

* నాడు ప్ర‌ధాని మోది అంగీక‌రించ‌లేదు

* శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం కూడా వాడీవేడిగా సాగాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రధాని న‌రేంద్ర‌మోదీ అంగీకరించలేదని.. ఆయన ఒప్పుకోనప్పుడు ప్రణాళికా సంఘం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తాము ప్రత్యేకహోదా సాధించలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంటున్నారని.. హోదా తెస్తారనే ప్రజలు ఓట్లేసి మిమ్మ‌ల్ని గెలిపించారంటూ ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని.. హోదా సాధించమనే అధికార పార్టీకి చెబుతున్నామన్నారు. తన పట్టుదల వల్లే తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం నిబద్ధతతో ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉంటూ కూడా కేంద్రాన్ని తాము విభేదించామన్నారు. ఆర్థిక శాఖ ఇచ్చిన హామీ మేరకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. పేరు మార్చాం కానీ.. హోదాతో వచ్చే లాభాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సభలో ఇచ్చిన హామీని ఎన్నోసార్లు గుర్తుచేశామన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ 29సార్లు దిల్లీకి వెళ్లానని.. రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాడానని పేర్కొన్నారు. హోదా సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున సాధించాలనే బాధ్యతను వారికి గుర్తు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Just In...