Published On: Tue, Apr 17th, 2018

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..!

* విజయవాడ, అమరావతి, గుంటూరు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు

* వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లోని పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలతో పాటు రాయలసీమ లోని చిత్తూరు జిల్లాలో 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలను మించిన ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 21 తేదీ నుంచి 22 తేదీ వరకూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే  ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సైతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశముందని తెలియచేసింది. రాగల నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయిలో ఎండవేడిమి నమోదు అయ్యే సూచనలున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ మంగ‌ళ‌వారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా విజయవాడ, అమరావతి, గుంటూరు, తిరుపతిలలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. విజయనగరంలో 42, కడప, శ్రీకాకుళం, ఏలూరులో 41 డిగ్రీలు, విశాఖ, కాకినాడ, నెల్లూరు, కర్నూలులో 40 డిగ్రీలు, అనంతపురం, ఒంగోలులో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 122 మండలాల్లో  40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 971 చోట్ల నమోదైంది. 30 నుంచి 35 డిగ్రీల మధ్య 75 ప్రాంతాల్లో నమోదైనట్లు తెలియచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 6 డిగ్రీల మేర పెరుగుదల నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోవటంతో వేడిగాలుల‌తో కూడా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Just In...