Published On: Sat, Jun 20th, 2020

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు…

* ప్ర‌క‌టించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ఏపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు విస్త‌రిస్తున్న కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని చెప్పారు. కేంద్ర హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 15న భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం సేకరించామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి పని చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఇంతమంది ఒకేచోట గుమిగూడటం అంత శ్రేయస్కరం కాదని పరీక్షలు వాయిదా వేశాం అన్నారు. కరోనా ప్రభలుతున్న తరుణంలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ‌న చెందకుండా సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి సురేష్ పేర్కొన్నారు. తొలుత జులై 10- 17 వరకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ఆన్‌లైన్, దూర‌ద‌ర్శ‌న్ ద్వారా పాఠాలు చెప్పారు. దీంతో పాటు పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు 11 పేప‌ర్ల‌ను 6కు కుదించారు. భౌతికదూరం పాటించ‌డం కోసం పరీక్ష కేంద్రాలు కూడా రెట్టింపు చేశారు. శానిటైజ‌ర్లు, ధ‌ర్మ‌ల్‌స్కాన‌ర్లు, మాస్క్‌లు సిద్ధం చేశారు. కానీ.. పరిస్థితి అదుపులో లేకపోవడంతో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో రాష్ట్రంలోని విద్యార్థులు, త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం స‌రైన నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొంటూ విద్యా సంఘాలు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి.

Just In...