Published On: Fri, Jan 8th, 2021

ఏపీలో రహదారులకు మహర్ధశ

* రోడ్‌ సెక్టార్‌లో అతిపెద్ద ఈఏపీకి ప్రభుత్వం శ్రీకారం

* రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో రహదారులకు మహర్ధశ రాబోతుంది. రోడ్‌ సెక్టార్‌లో అతిపెద్ద ఈఏపీ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి పక్కనే ఉన్న మరో మండల కేంద్రానికి రెండు వరసల్లో రహదారుల విస్తరణ ప్రారంభం కానుంది. మొత్తం రూ.6,400 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ సిద్దమైంది. ఏపీ మండల్‌ కనెక్టివిటీ అండ్‌ రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఏపీఎంసీఆర్‌సీఐపి), ఏపీ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ (ఏపీఆర్‌బిఆర్‌పి) పేరుతో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.3,200 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. మొత్తం 3104 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, నిర్మాణంతో పాటు 479 బ్రిడ్జిలను పునర్‌ నిర్మించనున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి విడతలో రూ. 2,978 కోట్లతో 1,243 కి.మీ రోడ్ల పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు కూడా మంజూరు అయ్యాయి. జ్యుడిషియల్‌ ప్రివ్యూ అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ. 85.43 కోట్లు ఆదా అయినట్లు ఆర్‌ అండ్‌ బీ అధికారులు తెలిపారు. మొదటి విడత పనుల్లో 13 ప్యాకేజీలకు గాను లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తయింది, ఈ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో విడత పనులకు సంబంధించిన డీపీఆర్‌లను కూడా రహదారులు, భవనాల శాఖ సిద్దం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ల మధ్య ఈ నెల 6న ఒప్పందం జరిగింది. ఇందులో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వాటా 70 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున బాల్దియో పురుష్ట్ర, జాయింట్‌ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్, ఏపీ ప్రభుత్వం తరపున ఎం టీ కృష్ణబాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రవాణా, రోడ్లు, భవనాల శాఖ, ఎన్‌డిబీ తరపున జియాన్‌ జు, వైస్‌ ప్రెసిడెంట్, సీవోవోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రోడ్‌ సెక్టార్‌లో రాష్ట్రానికి సంబంధించి ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌లలో ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్‌. సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశంలో ఆయన సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను సాధించినట్లు ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌‌ దాస్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎం వైఎస్ జగన్‌ను క‌లిసి వివరించారు. రోడ్ల నిర్మాణం నాణ్యతతో, త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించినందుకు ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులను అభినందించారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే రాష్ట్ర అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తాయని, మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం సాధ్యపడుతుందన్నారు. పోర్ట్‌లు, ఇండస్ట్రియల్‌ హబ్‌లకు గ్రామీణ ప్రాంతల మధ్య కనెక్టివిటీకీ ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. రహదారుల నిర్మాణం వల్ల సామాజిక అభివృద్ది సాధ్యపడుతుందని, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిధుల సహకారంతో మరింతగా  రాష్ట్రాభివృద్దికి అడుగులు వేయాలని సీఎం సూచించారు.

Just In...