Published On: Sat, May 18th, 2019

ఏపీలో 19 చోట్ల రీపోలింగ్ జ‌ర‌పాలి…

* సీఎస్‌ను క‌లిసిన మంత్రులు, తెదేపా నేత‌లు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. సచివాలయంలో మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, కొల్లు రవీంద్ర, జవహర్, నక్కా ఆనంద్‌బాబు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ విజ్ఞాపన పత్రాన్ని కూడా సీఈసీకి పంపుతూ రీపోలింగ్‌కు సిఫార్సు చేయాలని శుక్ర‌వారం సీఎస్‌ను క‌లిసి డిమాండ్ చేశారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్‌ కోసం గతంలోనే ఈసీఐని కోరినట్టు మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వైకాపా చేస్తున్న ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందిస్తున్న ఈసీ.. తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు. ముందుగానే ఈసీతో మాట్లాడుకుని సీఎస్‌కు వైకాపా ఫిర్యాదు చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. దశలవారీగా రీపోలింగ్‌ జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని మంత్రి వ్యాఖ్యానించారు. తమ విజ్ఞప్తిని సైతం సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరినట్టు  మంత్రి చెప్పారు.
తెదేపా రీపోలింగ్‌కు డిమాండ్‌ చేసిన స్థానాలివే..
నరసరావుపేట నియోజకవర్గంలోని  ఉప్పలపాడులో 214, 215 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు డిమాండ్ చేశారు. రాజంపేటలోని 78, 130, 131, 132 పోలింగ్  కేంద్రాల్లోనూ, కోడూరులో 21, 244, సత్యవేడులో 80, 81, జమ్మలమడుగులో 287, 288, సత్తెనపల్లిలోని 160, 161, 162 , చంద్రగిరిలో 310, 311, 323 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు.

Just In...