ఏపీ ఎన్నికల సంఘం జేడీపై వేటు
విజయవాడ, సెల్ఐటి న్యూస్: రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ ప్రకటించిన సమయంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోరాదని, అందరూ అందుబాటులో ఉండాలని ఎస్ఈసీ సూచించింది. అయితే అందుకు భిన్నంగా కార్యాలయంలో సంయుక్త సంచాలకులు సాయిప్రసాద్ 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను ప్రభావితం చేశారని.. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా జేడీ చర్యలున్నాయని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 243 డ్విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్ని తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు చేపట్టడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.