Published On: Mon, Jun 10th, 2019

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు…

* హోంగార్డులు, క‌మ్యూనిటీ హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు వేత‌నాల పెంపున‌కు మంత్రివ‌ర్గం ఆమోదం

* సీపీఎస్ ర‌ద్దు, ఆర్టీసీ విలీనంపై క‌మిటీ వేయాల‌ని నిర్ణ‌యం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం తొలి సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షతన సోమ‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో భేటీ అయిన కేబినెట్‌.. సుమారు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అక్టోబర్‌ నుంచి రూ.12,500 చెల్లింపుతో రైతు భరోసా అమలు, వైఎస్సార్‌ ఆసరా కింద వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కి పెంపు, ఆశా వర్కర్లకు రూ.10వేల వేతనాల పెంపునకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు భారీగా వేతనాలు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలోని 7,265 మంది హెల్త్‌వర్కర్లకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. సీపీఎస్‌ రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలపై కమిటీలు వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) పెంపుతో పాటు హోంగార్డులు, మున్సిపల్‌ కార్మికుల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

Just In...