Published On: Mon, Apr 16th, 2018

ఏపీ బంద్‌ను విజ‌య‌వంతం చేయాలి

* ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి పిలుపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం ఈ నెల 16న త‌ల‌పెట్టిన ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని తెలుగు ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. బంద్‌కు ఏపిసిసి సంపూర్ణ మద్దతు తెలిపినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోరాటాలు ఉధృతం చేస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలతో కలిసి దీక్షలు, నిరసనలు ప్రారంభించామ‌న్నారు. ఈ క్రమంలోనే హోదా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్‌కు దిగుతున్నామని రఘువీరారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు తెలిపారు. బంద్‌ను ఎవరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి కోరారు.

Just In...