Published On: Wed, Jul 10th, 2019

ఏ రంగం చూసినా పురోగ‌తి లేదు..

* మత్స్య రంగం పెరిగితే వ్యవసాయ వృద్ధి రేటు పెరిగినట్టా?

* గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పెద్ద ఎత్తున అప్పులు

* ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి స‌చివాల‌యంలోని ప‌బ్లిసిటీ సెల్‌లో బుధ‌వారం సాయంత్రం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2004- 2009లో మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాలుగా వృద్ధి చెందింది. ఆ కాలంలో 12శాతం వృద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు 2014-2019 ఎంతో కష్టకాలం. మనం వద్దనుకున్నా విభజన జరిగింది. పాలన కూడా ప్రజలు అనుకున్నట్టుగా జరగలేదు. వ్యవసాయంలో పురోగతి లేదు.. మత్స్య, పశు పరిశ్రమ అభివృద్ధిని వ్యవసాయాభివృద్ధిలో కలిపి చూపించారు. ఇలాంటి పద్ధతి గతంలో ఎప్పుడూ లేదు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనేది అవాస్తవం. గత ఐదేళ్లులో వ్యవసాయ రంగంలో పురోగతి లేదు. ఏ రంగం చూసినా ఇదే పరిస్థితి. అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయి. దేశ సగటుతో పోలిస్తే ఏపీ స్థూల ఉత్పత్తి తక్కువే.2004-09 మధ్య స్థూల ఉత్పత్తి బాగా పెరిగింది. 2014-2019 మధ్య వృద్ధి రేటు 11శాతమని లెక్కలు చెబుతున్నాయి.ఆ గణాంకాలు ఎంతవరకు నిజమో చూడాలి. వ్యవసాయ వృద్ధి రేటు దేశంలోనే అత్యధికమని గత ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. మత్స్య రంగం పెరిగితే వ్యవసాయ వృద్ధి రేటు పెరిగినట్టా? ద్రవ్యోల్బణం జాతీయ స్థాయిలో బాగా తగ్గినా ఏపీలో మాత్రం పెరిగింది. ప్రజలందరినీ భయపెట్టిన అంశం అప్పులే. గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా రుణాలు తీసుకున్నార‌ని బుగ్గన పేర్కొన్నారు.

లోటు బడ్జెట్‌ నిధుల్నీ తేలేకపోయారు….
గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేశారు. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. గత ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు చేసింది. తెలంగాణకు వచ్చినట్టు మనకు పన్ను ద్వారా ఆదాయం రాలేదు. రాష్ట్ర జీడీపీలో 3శాతం దాటి అప్పులు చేయకూడదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.15వేల కోట్లు దాటింది. తలసరి ఆదాయం చూస్తే తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నాం. ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నాయనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ అంశాన్ని నీరు గార్చి ప్రత్యేక ప్యాకేజీ వినూత్నమైనదంటూ తెదేపా ప్రభుత్వం సంతోషంగా తీసుకుంది. ఆ ప్యాకేజీలో ఉన్నదంతా పునర్విభజన చట్టంలోని హామీలే. చట్టపరంగా మనకు వచ్చే హక్కులనే రీప్యాకేజ్‌ చేసి పేపర్‌లో పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాకేజీనైనా సాధించారా అంటే అదీ లేదు. తొలి ఏడాదే లోటు బడ్జెట్‌ నిధులను కేంద్రం నుంచి తేలేకపోయారు. ఘోరమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మాకు అప్పగించింది’’ అని బుగ్గన విమర్శించారు.

అన్ని శాఖల్లోనూ నిధులు పెండింగే…!
రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ పెద్ద ఎత్తున నిధుల చెల్లింపులను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పెండింగ్‌లో లేకుండా చెల్లించింది. ఆర్నెల్ల క్రితం నాటి మధ్యాహ్న భోజన పథకం బిల్లులతో పాటు హొంగార్డులు, అంగన్‌వాడీల జీతాలను సైతం పెండింగ్‌లో ఉంచింద‌ని బుగ్గన వివరించారు.

Just In...