Published On: Fri, Jul 12th, 2019

ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేత‌

* వినియోగ‌దారుల‌కు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్

సెల్ఐటి న్యూస్‌, బిజినెస్ డెస్క్‌ (ముంబయి): స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రోజులో ఏ క్షణంలోనైనా డబ్బులు పంపేందుకు ఐఎంపీఎస్‌ ఉపయోగపడుతుది. ప్రస్తుతం రూ.వెయ్యి రూపాయల వరకు లావాదేవీలపై ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు. రూ.1000-10,000 వరకు 1+జీఎస్టీ, రూ.10,001-1,00,000 వరకు రూ.2+జీఎస్‌టీ, రూ.1,00,001-2,00,000 వరకు లావాదేవీలపై రూ.3+జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇకపై ఈ ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేయదు. గత నెల ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో జులై 1 నుంచి ఎస్‌బీఐ వాటిపై ఛార్జీలను ఎత్తివేసింది.

Just In...