Published On: Fri, Nov 2nd, 2018

ఒంగోలులో ఆంధ్ర కేస‌రి టంగుటూరు ప్ర‌కాశం విశ్వ‌విద్యాల‌యం

* మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్ల‌డి

* అధికారికంగా జీవో ఎం.ఎస్.నెం 32 జారీ చేసిన ప్ర‌భుత్వం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఒంగోలులో ఆంధ్ర కేస‌రి టంగుటూరు ప్ర‌కాశం విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేయ‌డం ద్వారా ఒంగోలు ప్ర‌జ‌ల చీర‌కాల ఆకాంక్ష‌ను నెర‌వేర్చామ‌ని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అన్నారు. విద్యాప‌రంగా వెనుక‌బ‌డిన ప్ర‌కాశం జిల్లాలో వ‌ర్శ‌టీ ఏర్పాటు చేయ‌డం చారిత్ర‌క ఘ‌ట్ట‌మ‌ని అభివ‌ర్ణించారు. గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ర్శ‌టీ ఏర్పాటు చేస్తూ జీవో నెం జీవో ఎం.ఎస్.నెం 32 విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా మంత్రి గంటా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒంగోలు పీజీ సెంట‌ర్ ను అప్ గ్రేడ్ చేస్తూ వ‌ర్శ‌టీని ఏర్పాటు చేయడం ద్వారా గ‌తంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకొన్నామ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు. అన్ని జిల్లాల్లో వ‌ర్శ‌టీ వున్న‌ప్ప‌టికీ ఒంగోలు వ‌ర్శ‌టీ లేక‌పోవ‌డం కొర‌త‌గా వుండేద‌ని, దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర్శటీ ఏర్పాటు చేయాల‌ని  సంకల్పించి చ‌ర్య‌లు తీసుకొన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్టం -1991 ప‌రిధిలోకి వ‌ర్శ‌టీ వ‌స్తుంద‌ని, వ‌చ్చే శాస‌న‌స‌భ స‌మావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలుపుతామ‌న్నారు. విద్యాప‌రంగా తాము ఇచ్చిన అన్ని హామీలు నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నామ‌ని ఈ క్ర‌మంలోనే ఒంగోలులో కూడా వ‌ర్శ‌టీ ఏర్పాటు చేశామ‌న్నారు. మ‌హ‌నీయుని ఆంధ్ర‌కేస‌రి టంగుటూరు ప్ర‌కాశం పేరును వ‌ర్శ‌టీకి నామ‌కార‌ణం చేశామ‌ని, ఆయ‌న స్ఫూర్తితో రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌ని తెలిపారు. వ‌చ్చే జ్ఞాన‌భేరీలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా వ‌ర్శ‌టీ ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. ప్ర‌స్తుతానికి పీజీ సెంట‌ర్‌కు వున్న 114 ఎక‌రాల్లో వ‌ర్శ‌టీ ఏర్పాటు అవుతుంద‌ని మంత్రి గంటా తెలిపారు. ప్ర‌స్తుతం 10 కోర్సులతో పీజీ సెంట‌ర్ న‌డుస్తోంద‌ని, పీజీ సెంట‌ర్‌కు అనుబంధంగా 137 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలు, 48 మంది సిబ్బంది ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. వ‌ర్శ‌టీ ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల ఆకాంక్ష‌ను సార్థ‌కం చేయ‌డం సంతోషంగా వుంద‌ని మంత్రి గంటా తెలిపారు.

Just In...