Published On: Tue, Oct 20th, 2020

ఒక్కరోజు మునిగినా సాయం అందించాల్సిందే…

* ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: వరద బాధితులకు ఉచితంగా బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషమేనని కానీ.. వారం రోజులు మునిగిపోయిన వారికి మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేదల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నించడమేనని, ఒక్కరోజు మునిగినా, రెండు రోజులు మునిగిన ఇళ్ళకైనా ప్రభుత్వ సాయం అందించాల్సిందేన‌ని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ సరుకులు సాయం పొందాలంటే వారం రోజులు పైగా ఇళ్ళు మునిగి ఉన్న వారికే అర్హత అని ప్రకటించారని ఒక రోజు, రెండు రోజులు మునిగినా ఇంట్లో సామాన్లన్నీ దెబ్బతింటాయని , వరద ముంపు వల్ల ఇళ్ళల్లోకి మట్టి చేరుతుందని ఒక రోజైనా, వారం రోజులైనా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకోవాల్సిందేన‌ని దీనికి తోడు, కొంత సామాన్లు నష్టపోతారని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వరద బాధితులందరికీ ప్రభుత్వం సాయం అందించాలని గద్దె రామమోహన్ కోరారు. కృష్ణా కరకట్ట వాసులకు వరద వచ్చినప్పుడు రెండు మూడు రోజుల్లోనే వరదనీరు తగ్గిపోతుందని, వారం రోజులు మునిగిన వరద ముంపు బాధితులకే సాయం చేస్తామంటే పేపర్లలో ప్రభుత్వం సాయం అందిస్తున్నట్లు ప్రకటించుకుని, ఆచరణలో అర్హులైన లబ్ధిదారులు లేరని చెప్పడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. బాధితులకు ఉచితంగా అందించే సరుకులపై కలెక్టర్లు భారీగా ప్రచారం కల్పించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.ఉషారాణి
ఉత్తర్వుల్లో పేర్కొనడం , సాయం కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉందని గద్దె రామమోహన్ పేర్కొన్నారు.

Just In...