Published On: Sat, Mar 9th, 2019

ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకుట్ర రచించారు

* రాష్ట్ర ప్రజలు,దేశ ప్రజలు దీనిపై ఆలోచించాలి
* ‘బాహుబలి’ని మించిన కుట్ర ఇది
* డేటా చోరీ వ్యవహారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు
సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై యథేచ్ఛగా కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్య‌మంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. తెదేపాను నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు. డేటా చోరీ వ్యవహారంపై ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో శ‌నివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
            ‘‘రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి. చేసిన కుట్రలు బయటపడితే ప్రజలు ఛీ కొడతారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెదేపా డేటాను దొంగిలించి వైకాపాకు ఇవ్వాలని కుట్ర పన్నారు. తెదేపాను నాశనం చేయాలని చూస్తున్నారు. దుష్ట చతుష్టయం ఏమేం చేస్తున్నారో ప్రజలకు చాలా సార్లు చెప్పా. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన కుట్ర, కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే దీనికి సూత్రధారులు అన్నారు. ఈ కుట్రకు దిల్లీలోనే బీజం పడింది. మొదటగా దిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దగ్గర్నుంచి పలు చోట్ల ఫిర్యాదులు ఇచ్చారు. ముందుగా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. ఆ తర్వాత పలు చోట్ల ఫిర్యాదు చేశారు. ఈసీకి ఇచ్చిన నోట్‌తో పాటు వీళ్ల ప్రణాళిక రాసుకున్న పత్రాలు కూడా ఇచ్చారు. వాళ్ల యాక్షన్‌ ప్లాన్‌తో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత అశోక్‌ను విచారించారు. ఐటీ గ్రిడ్‌ కంపెనీలో సోదాలు చేశారు. ఐటీ గ్రిడ్‌ నుంచి మా డేటా ఎత్తుకెళ్లిపోయారు. వైకాపా కుట్ర ప్రణాళికకు అక్కడి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. మా డేటాను దొంగతనం చేశారు. అక్కడి పోలీసుల దాడికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టాం. ఈ నెల రెండో తేదీ అర్ధరాత్రి అక్కడి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఎవరైనా అర్ధరాత్రి ఇలాంటి ఫిర్యాదులు చేస్తారా? ఫిర్యాదు అందుకున్నాక తెల్లవారే కంపెనీలో సోదాలు నిర్వహించారు. కంపెనీ ఉద్యోగుల ఆచూకీ కోసం ఐటీ గ్రిడ్‌ కంపెనీ యజమాని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు వెంటనే విచారణ జరిపింది. తెల్ల కాగితాలపై వీఆర్‌ఓల సంతకాలు తీసుకోవడమేంటని కోర్టు ప్రశ్నించింది. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రెస్‌మీట్‌లో సోదాల విషయం పూర్తిగా చెప్పలేదు. 23వ తేదీన ఐటీ గ్రిడ్‌లో సోదాలు నిజమని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. ప్రాథమిక విచారణ చేశామని స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. విజయసాయిరెడ్డి దర్శకత్వంలో అక్కడి పోలీసులు వ్యవహరించారు. కేసు 2న నమోదు చేస్తే 23న విచారణ జరపడమేంటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇష్టానుసారంగా చేస్తూ దొంగ రిపోర్టు చేయాలని కుట్ర పన్నారు. నా డేటా దొంగిలించడానికి వారికి అధికారం  ఎవరిచ్చారు. గవర్నర్‌ వద్దకు తెరాస, భాజపా, వైకాపా నాయకులు ఒకరి వెంట ఒకరు వెళతారు. కేసీఆర్‌ వేల కోట్లు రూపాయలు పంపుతారు. ఎందుకంటే ఆయనకు సామంతరాజ్యం కావాలి. ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడడమే వారి కుట్ర. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆయన కేసుల మాఫీ కోసం తెరాసతో చేతులు కలుపుతారు. ఈ కుట్రలో భాగంగానే నిన్న మళ్లీ భాజపా వాళ్లు మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేశారు. వైకాపా, భాజపా, తెరాస కలిసి ఈ కుట్రను రక్తికట్టిస్తున్నాయి’’ అని చంద్రబాబు అన్నారు.
ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్‌ వర్సస్‌ తెదేపా…
కేసీఆర్‌ కావాలా.. తెదేపా కావాలా ప్రజలు నిర్ణయించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. జగన్‌ ఆత్మగౌరవం అమ్ముకుని హైదరాబాద్‌కు అమ్ముడుపోయారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్‌ ఎన్నో రకాలుగా అవమానించారు. మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలను తెలంగాణ ఇవ్వాలి. మీ పెత్తందారి వ్యవస్థ చూపించొద్దు.. మేం ఒప్పుకోం. విభజన గాయాలపై కారం పూసి ఆనందిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదు.. వస్తాను, తేల్చుకుంటానని కేసీఆరే చెప్పారు. రేపు ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్‌, తెదేపా మధ్యే అని చంద్రబాబు అన్నారు.
 

Just In...