Published On: Wed, Jun 12th, 2019

ఓటమితో చంద్రబాబు మైండ్ బ్లాక్

* రాష్ట్ర మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్

* జగన్ రైతు పక్షపాతి…రైతులను మోసగించిన చంద్రబాబు

* రెండేళ్ల ముందుగానే రైతు భరోసా పథకం అమలు

* ప్రాజెక్టుల్లో అవినీతి లేకుంటే పనులు ఆపేది లేదు…

* మంత్రి అనిల్‌కుమార్ యాదవ్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యిందని, ప్రతిపక్షంలో కూర్చున్నారన్న బాధలో 13 రోజుల కిందట ఏర్పడిన జగన్ ప్రభుత్వంపై అబద్ధాలతో కూడిన విమర్శరలు చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. రైతు పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, సాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష నేతకు ఉలుకెందుకని వారు ప్రశ్నించారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి తామేదో చేసినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రైతు రుణమాఫీ చేస్తామంటూ 2014 ఎన్నికల ముందు రూ.87 వేల కోట్ల మేర రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు రైతుల ఓట్లు వేయించుకున్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరవాత కేవలం రూ.15,279 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు రుణమాఫీ కింద 3,979 కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకున్నారన్నారు. కేవలం రూ.376 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారన్నారు. చెప్పినదాంట్లో పది శాతం కూడా ఇవ్వలేదన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా, అన్నదాత సుఖీభవ పేరుతో మరో పథకం చంద్రబాబునాయుడు ఎందుకు ప్రారంభించారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ఇపుడు రైతు రుణమాఫీ 4,5 విడతలు తమ ప్రభుత్వం అందజేయాలని ప్రతిపక్ష నేత కోరడం అర్థరహితమన్నారు.

ధాన్యం డబ్బుల కోసం రైతులు ఎదురు చూపులు…
ఇటీవల వ్యవసాయ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో గత ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న రూ.4,800 కోట్లు దారిమళ్లించినట్లు తెలిసిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ధాన్యం కొనుగోలు, ఇతర అవసరాల కోసం సివిల్ సప్లయ్స్ కార్నొరేషన్ పేరుతో తెచ్చిన నిధులు దారిమళ్లించడమేమిటని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి డబ్బులు కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. రైతులకు రూ.2 వేల కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీ గతప్రభుత్వం బకాయి పడిందన్నారు. ఈ పాపం ఎవరిది అని మంత్రి ప్రశ్నించారు. రైతు సంక్షేమం గురించి చంద్రబాబు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. కరవు ప్రాంతాల కోసం కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.932 కోట్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు.

రెండేళ్ల ముందుగానే రైతు భరోసా పథకం అమలు…
అధికారంలోకి వచ్చిన తరవాత 2 ఏళ్ల తరవాత రైతు భరోసా పథకం ప్రవేశపెడతామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిన సీఎం జగన్…ఈ ఏడాది అక్టోబర్ నుంచే రైతు భరోసా పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారన్నారు. 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా, రెండేళ్ల ముందుగానే పథకాన్ని ప్రారంభించడం సీఎం జగన్ కే చెల్లిందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమన్నారు.
40 శాతం సబ్సిడీపై వేరుశనగ, మొక్కజొన్న విత్తనాల పంపిణీ..
వ్యవసాయాధికారులతో నిర్వహించిన రివ్యూలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని తెలిసిందని, దీనికి యూసీలు ఇవ్వకపోవడమేకారణమని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథాన్యమన్నారు. రాయలసీమ రైతులకు 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందజేయాలని, విజయనగరం, శ్రీకాకుళం రైతులకు 40 శాతం సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేయాలని కూడా ఆదేశించామన్నారు.

 

ప్రాజెక్టుల్లో అవినీతి లేకుంటే పనులు ఆపేది లేదు… (మంత్రి అనిల్ కుమార్ యాదవ్)
సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆపేస్తామంటూ ప్రతిపక్ష నేతచంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే చేపట్టిన పనులు తాము కూడా కొనసాగించామని చంద్రబాబునాయుడు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు తాము కూడా ఆపడంలేదని స్పష్టం చేశారు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం చంద్రబాబుకు అలవాటైందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతి అరికట్టి, ప్రజాధనాన్ని కాపాడడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే జ్యూడిషియల్ కమిటీ చేస్తున్నామన్నారు. ఈ కమిటీ 2,3 నెలల్లో నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా ఏ పనులు చేపట్టాలి… వేటిని రీ టెండరింగ్ కు పిలవాలనేది తేలుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. పనులు ప్రారంభంకానివి, 25 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులపై కమిటీ నివేదిక రూపొందిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు నీతిగా పనిచేసుంటే, ఆయనకు ఉలుకెందుకని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మేజర్ ప్రాజెక్టు అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. రైతు పక్షపాతి జగన్ అని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ వచ్చే అయిదేళ్లలో పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీరందించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. 13 రోజుల జగన్ ప్రభుత్వం పాలనకే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యిందని అన్నారు. దేశంలో అందరూ మెచ్చుకోతగ్గ రీతిలో జగన్ పాలన సాగిస్తారని, ఇక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని మంత్రి జోస్యం చెప్పారు.

Just In...