Published On: Wed, Nov 14th, 2018

ఓట‌మికి అయినా సిద్ధం – విలువ‌లు మాత్రం వీడ‌ను

* నా చుట్టూ తిరిగితే నాయ‌కులు అయిపోరు

* గ్రామాల్లోకి వెళ్లి జ‌నం స‌మ‌స్యలు తెలుసుకోండి

* ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇస్తేనే ప‌నిచేస్తామ‌నే వారు రావ‌ద్దు

* నా ద‌గ్గర ఒక మాట బ‌య‌ట ఒక మాట చెప్పొద్దు

* పిఠాపురం జ‌న‌సేన నాయ‌కులు, కార్యక‌ర్తల‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 

సెల్ఐటి న్యూస్‌, కాకినాడ‌: పోస్ట‌ర్లు క‌డితేనో, నా చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తేనో నాయ‌కులు అయిపోర‌నీ, గ్రామాల్లోకి వెళ్లి జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌నీ జ‌న‌సేన శ్రేణుల‌కి పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇస్తేనే ప‌ని చేస్తామ‌నే వారు త‌న ద‌గ్గ‌రికి రావ‌ద్ద‌ని స్పష్టం చేశారు. మంగ‌ళ‌వారం కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. పిఠాపురం స‌భ‌ని విజ‌య‌వంతం చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. “2009 త‌ర్వాత ఎలాంటి రాజ‌కీయ అండ‌దండ‌లు లేకుండా, వేల కోట్ల ఆస్తులు లేకుండా, ఓట‌మి లోతుల నుంచి ఉన్న కొద్దిపాటి అనుభ‌వంతో పార్టీ పెట్ట‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. అయినా నేడు జ‌న‌సేన జెండా లేని గ్రామంగానీ, జ‌న‌సైనికులు లేని ఊరు గానీ లేదు. యువ‌త ఎంతో ప్రేమ‌తో ముందుకి వ‌స్తున్నారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. నాయ‌కుల‌కి చెబుతున్నా, వారి శ్ర‌మ‌ని వృథా చేయ‌కండి. స్థానికంగా ఉండే నాయ‌కులు వారితో మ‌మేకం అవ్వండి. బ‌లంగా ప‌ని చేసే కార్యక‌ర్త‌ల్ని గుర్తించండి. నేను క‌ష్ట‌ప‌డుతున్నా. ఎలాంటి అండ‌దండ‌లు లేకుండా పార్టీని ముందుకి తీసుకెళ్ల‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. నేను ఓ భావ‌జాలంతో ముందుకి వెళ్తుంటే, నాయ‌కులు, కో-ఆర్డినేట‌ర్ స్థాయి నాయ‌కులు, స్థానిక నాయ‌కులు చిన్న‌పాటి వ్య‌క్తిగ‌త ఇష్టాల‌తో పార్టీని ముందుకి తీసుకువెళ్తూపోతే, చూస్తూ ఊరుకోను. కొద్ది మంది ఇలా గ్రూపులు క‌డితే అర్ధం చేసుకోలేని వ్య‌క్తిని కాదు. ఎవ్వ‌రు ఉన్నా లేకున్నా ఒక్క‌డినే పార్టీని ముందుకి తీసుకువెళ్లి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం ఉంది. పార్టీ పెట్టిన‌ప్పుడు నా వెనుక ఉన్నది ప‌ది మంది యువ‌త మాత్ర‌మే. ఆ ప‌ది మందే జ‌న‌సేన పార్టీకి పునాది. వారిని కాదంటే ఎలా?  కార్య‌క‌ర్త‌ల‌కీ, జ‌న‌సైన్యానికీ చెబుతున్నా మీ త్యాగాన్ని, శ్ర‌మ‌నీ గుర్తిస్తా. కులాలు, మ‌తాలు, ప్రాంతాల్ని వేరు చేసే రాజ‌కీయాలని ఎవ‌రూ ప్రోత్స‌హించ వ‌ద్దు. అన్నింటినీ స‌మ‌దృష్టితో ముందుకి తీసుకువెళ్లే స‌త్తా నాకు ఉంది. రాత్రికి రాత్రి ముఖ్య‌మంత్రి అయిపోదామ‌న్న కాంక్ష‌తో రాజ‌కీయాల్లోకి రాలేదు. బ‌ల‌మైన మార్పుని తీసుకురావాల‌న్న‌, ఆలోచ‌నా విధానం ఉన్న వాడిని. 2009లో చిరంజీవి పెట్టిన పార్టీ ఓడిపోయిన‌ప్పుడు, కొద్ది మంది వ్య‌క్తులు, ఆయ‌న ప‌క్క‌న ఎమ్మెల్యేలుగా ఉన్న వ్య‌క్తులే పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేశారు. దీంతో ఒక మార్పుని బ‌లంగా తీసుకువ‌చ్చే స‌మ‌యం కాస్త వృథాగాపోయింది. ఈ సారి జ‌న‌సేన పార్టీలో మాత్రం అలా జ‌ర‌గ‌దు. ఇది నాయ‌కుల కోసం ఉన్న పార్టీ కాదు ప్ర‌జ‌ల కోసం ఉన్న పార్టీ. పొలిటిక‌ల్ పార్టీల తీరు వ‌ల్ల విసిగిపోయా. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఎక్క‌డా కులం లేదు. ఇన్ని ప్రాంతాల నుంచి ఇంత మంది యువ‌త క‌దిలి వ‌స్తున్నారు. మాకున్న‌ది ఒక‌టే కులం మాన‌వ‌కులం. ఈ మ‌ధ్య టీడీపీ నాయ‌కుల‌కి నోటి దుర‌ద ఎక్కువైపోయింది. ముఖ్య‌మంత్రికే నోరు అదుపు లేదు. ఎవ‌రైనా ద‌ళితుడిగా పుట్టాల‌నుకుంటారా.? అంటారు. ముఖ్య‌మంత్రి ద‌ళితుడిగా పుట్టాల‌నుకోక‌పోవ‌చ్చు.. నేను మాత్రం రెల్లి కులాన్ని స్వీక‌రిస్తాను. టీడీపీ ఎమ్మెల్యేలు కులాల పేరిట ప్ర‌జ‌ల్ని దూషిస్తారు. ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్యేలు మ‌త్స్య‌కారుల్ని దూషిస్తారు. వారిని మీరు, మీ లోకేష్ స‌మ‌ర్ధిస్తారు. బాల‌కృష్ణ జ‌న‌సేన పార్టీలోకి వ‌చ్చే వారిని సంక‌ర‌జాతి నా కొడుకులు, అల‌గాజ‌నం అని తిడ‌తారు. జ‌న‌సేన లేక‌పోతే టీడీపీ ఎక్క‌డ ఉంది. మీకు భుజం కాసిన మ‌మ్మ‌ల్ని తిట్టొచ్చా. ప‌ది మంది చూసే ఆ న‌టుడు మ‌రోవైపు ఆడ‌పిల్ల‌ని చూస్తే క‌డుపు చేస్తా అంటారు. ఇది చ‌ప్ప‌ట్లు కొట్టే అంశమా. అలాంటి వారిని వెన‌కేసుకొస్తారా.? ఏం మాట‌ల‌వి.
         టీడీపీ నేత‌లు చేసే త‌ప్పులు జ‌న‌సేన‌లో ఎవ‌రైనా చేస్తే చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయి. మీరు ఒక కులాన్ని, ఒక మ‌తాన్ని వెన‌కేసుకొచ్చినా, తిట్టినా నేను ఊరుకోను. ఓట‌మికి అయినా సిద్ధం కానీ విలువ‌లు మాత్రం వ‌దిలిపెట్ట‌ను. పార్టీ నాయ‌కులంద‌రికీ చెబుతున్నా ద‌య‌చేసి కులాల కుంప‌ట్లు పెట్టొద్దు. మార్పు తెస్తాం. ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తాం. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంకా కొద్ది కాలం క‌ష్ట‌ప‌డండి. బాధ్య‌త‌తో కూడిన జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని తీసుకొద్దాం. గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం. అంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి. మ‌న గ్రామాల్ని, ప్రాంతాల్ని బాగుచేసుకుందాం. 1983లో మొద‌లైన టీడీపీ 2014కి తెలంగాణ‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఈ రోజున ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అదే ప‌రిస్థితి. మ‌రో పార్టీ అండ‌లేకుండా ప‌ని చేయ‌లేరు. చంద్ర‌బాబు కొడుకు పంచాయితీ ప్రెసిడెంట్‌గా కూడా గెల‌వ‌కుండా మంత్రి అయిపోయారు. ఇలాంటి వ్య‌క్తులు మ‌న‌కి వ‌ద్దు. పంచాయితీ స్థాయిలో మార్పులు తెచ్చే వ్య‌క్తులు కావాలి. 2019 నాకు మూడో ఎన్నిక‌. ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కావాలి అన్న కోరిక లేదు. యువ‌త‌, ఆడ‌ప‌డుచులు మీరు ముఖ్య‌మంత్రి కావాలి అని బ‌లంగా కోరుకుంటుంటే కొద్ది రోజుల క్రిత‌మే స‌మ్మ‌తించా. నేను బాధ్య‌త‌గా ఉంటా. పోస్ట‌ర్లు వేయించో, ఫ్లెక్సీలు క‌ట్టించో నాయ‌కులు అయిపోరు. ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌య్యే వారు కావాలి. ఫ్లెక్సీలు వేసుకునే వారిని నేను గుర్తించ‌ను. క్షేత్ర స్థాయికి వెళ్లండి. క‌ష్ట‌ప‌డండి. నేను ప‌ని చేస్తున్నా, మారుమూల ప్రాంతాల‌కి వెళ్తున్నా, డంపింగ్ యార్డుల్లో తిరుగుతున్నా. నేను తిరుగుతున్న‌ప్పుడు, మీరు ఎందుకు తిర‌గ‌రు. నా చుట్టూ తిర‌గ‌డం కాదు, గ్రామాల్లోకి వెళ్లి తిర‌గండి. జ‌న‌సేన పార్టీ ఓ పుష్ప‌క విమానం. ఇత‌రుల్ని కూడా పార్టీలోకి రానివ్వండి. అంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలంటే కాలేరు. ముందు ప్ర‌జాసేవ చేయాల‌న్న ఆకాంక్ష కావాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాల‌నుకునే వారు నా వ‌ద్ద‌కి రావ‌ద్దు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకుని ఏ ఒక్క‌రూ ప‌నిచేయొద్దు. రెండు బ‌ల‌మైన పార్టీల‌ను ఎదుర్కోవాలి. జ‌న‌సేన పార్టీ వ‌స్తే అంద‌రికీ మంచి జ‌రుగుతుంది. నాయ‌కులు త‌ప్పు చేస్తే జ‌న‌సైనికులు స‌రి చేయండి త‌ప్పులేదు. పిఠాపురంలో మ‌త్స్య‌కార గ్రామాల్లో జ‌న‌సేన స‌భ‌ల‌కి వెళ్లొద్ద‌ని భ‌య‌పెడుతున్న విష‌యం నా దృష్టికి వ‌చ్చింది. ఇలాంటి వారంతా ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చిన రోజున జ‌న‌సేన సృష్టించే ప్ర‌వాహంలో కొట్టుకుపోతార‌”ని అన్నారు.

Just In...