Published On: Fri, Nov 20th, 2020

ఓట‌మితో చంద్రబాబుకు మతిభ్రమించింది…

* మంత్రి కొడాలి నాని

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: గత ఎన్నికల్లో వైయస్ జగన్ ఇచ్చిన షాక్, కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితితో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి పాలైన‌ప్ప‌టి నుంచి ఖాళీగా, ఒంటరిగా వుంటూ ఎవరో ఇచ్చిన సమాచారంతో సీఎం జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. త‌మ ప్రభుత్వం ఇసుకను కొందరికి దోచిపెడుతోందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబులాగా బినామీలకు ఇసుకను దోచిపెట్టాలంటే… వారి హయాంలో చేసినట్లు ఉచిత ఇసుక పాలసీనే తాము కూడా అమలు చేసేవార‌మన్నారు. డ్వాక్రా గ్రూపుల పేరుతో ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు ఆయన అనుయాయులు ఏ రకంగా దోచుకున్నారో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళ‌లు ఎవ‌రూ కూడా రీచ్ నుంచి ఇసుకను తీసి విక్రయించలేదని, చంద్రబాబు, ఆయన అనుచరులే ఇసుక దందా చేశారని అన్నారు. చివరికి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లనివ్వడం లేదని మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టి కొట్టారని గుర్తు చేశారు. వీరి అవినీతి వల్ల ఎన్‌జిటి రూ.వంద కోట్లు జరిమానా విధించిందన్నారు. ఈ పరస్థితిని చక్కదిద్దుతూ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆదాయం రావాలని, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరగకూడదనే మంచి ఉద్దేశంతో ఇసుక పాలసీని తీసుకువచ్చారని తెలిపారు. ఏ ప్రాంతంలో ఎంత ఇసుక అవసరం, రీచ్‌ ల నుంచి వినియోగదారులకు సులభంగా దానిని ఎలా అందించాలనే ఉద్దేశంతో మెరుగైన ఇసుక పాలనీని తీసువస్తుంటే… చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు చెబుతున్న శేఖర్‌రెడ్డి ఆయన మిత్రుడేనని, ఎపికి తీసుకువచ్చిందే చంద్రబాబు అని అన్నారు. భారతదేశంలోనే పేదల కోసం వేల కోట్లు అందిస్తున్న మహానుభావుడు వైయస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయనను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.

Just In...