Published On: Thu, Jun 14th, 2018

కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్య‌మానికి తెదేపా ఎంపీలు సిద్ధం

* బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి

* ఎంపీ కేశినేని నాని 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కేంద్రంతో పాటు బీజేపీ ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పచ్చిమోసం చేశాయ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. జీవియల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేస్తామని చెప్పడంతో సంతోషించామ‌న్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం కుదరదని కోర్టులో కేస్ ఫైల్ చేసి మరోసారి మోసం చేసింద‌న్నారు. నికాన్ సంస్థ నివేదిక ఇచ్చిన ఆధారంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్రం హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ కుదరదని కేంద్రం చెప్పినా బీజేపీని ప్రశ్నించకుండా వైఎస్ జ‌గ‌న్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న్నాడ‌న్నారు. ఎంపీల రాజీనామాల విషయంలో డ్రామాలు ఆడుతున్నాడ‌ని మండ్డిప‌డ్డారు. ఎన్నికలు రావని తెలిసి కూడా రాజీనామాల డ్రామా ఆడిస్తున్నాడ‌న్నారు. డ్రామాలు ఇప్పటికైనా ఆపి పార్లమెంట్లో టీడీపీతో కలిసి కేంద్రంపై పోరాడాల‌ని పేర్కొన్నారు.  9 నెలల్లో ఎన్నికలు రానున్న నేప‌ధ్యంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ ఇవ్వాల‌ని, విభజన హామీలు నెరవేర్చాల‌ని డిమాండ్ చేశారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతుంటే జరగడంలేదని బీజేపీ, జగన్ విమర్శలు చేస్తున్నాయ‌న్నారు. ప్రధాని మోదీ కోటి ఉద్యోగాలు ఇస్తామన్నార‌ని .. ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయ‌ని విమ‌ర్శించారు. దేశంలో అవినీతి పెరిగింద‌ని, బీజేపీ పాలనలో మోసాలు పెరిగాయ‌ని, ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ పై నమ్మకం పొయింద‌న్నారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయ‌ని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని పేర్కొన్నారు. బీజేపీ పాల‌న‌లో వ్యవస్థలను నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి చేశారని దమ్ముంటే నిరూపించాల‌న్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తామన్నారు ఏం చేశార‌ని మోదీని ప్ర‌శ్నించారు. బీజేపీ నాయకులు రాష్ట్రాభివృద్ధికి పోరాడాల‌ని పిలుపునిచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేసేందుకు తెదేపా ఎంపీలంతా ఉద్యమానికి సిద్ధమ‌వుతున్న‌ట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి కావాల్సిన అన్ని అంశాలపై కేంద్రంతో పోరాడతాం అని ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు.

Just In...