Published On: Tue, Jan 21st, 2020

కనులపండువగా ప్రారంభ‌మైన శ్రీవారి నిత్యోత్సవాలు…

* గోవింద‌నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగిన పున్న‌మీఘాట్‌

* త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌న సందోహం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ఇంద్ర‌కీలాద్రి దిగువ‌న పవిత్ర కృష్ణానది తీరాన భవానీపురం పున్నమి ఘాట్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవాలు సోమవారం ఉదయం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్యోత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా సోమవారం ఉదయం స్వామి వారిని కన్నుల పండువగా అలంకరించి సుప్రభాత సేవతో పూజాదికాలు ప్రారంభించారు. తోమాల సేవ విశేషాలంకరణ సేవ, విశ్వరూప దర్శనం మొదలైన పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయం సమీపంలోనే యాగశాలను ఏర్పాటు చేసి మహా శాంతి హోమం జరిపించారు. మొదటి గంటా నివేదన అనంతరం భక్తులకు సర్వదర్శనం చేశారు. ఉదయం 11 గంటల నుంచి కళ్యాణ మండపంలో శ్రీవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలో శ్రీ నిర్గుణ చైతన్య స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కళావేదికలో అన్నమాచార్య సంకీర్తన లతో పాటు ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు చేశారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం అన్నమాచార్య కీర్తనల అనంతరం ఆలయ సమీపంలోని వీధులలో ఉత్సవమూర్తుల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఉచితంగా పూజా సామాగ్రి అందజేశారు. స్వామివారి ప్రసాదంగా లడ్డు వడ అందచేశారు. అలానే ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ తాగునీరు ఏర్పాటు చేశారు. కళా వేదిక దగ్గర విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్ పరిసరప్రాంతాలు అన్నిటినీ దేవతా మూర్తుల బొమ్మలను సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీప కాంతులతో పున్నమి ఘాట్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తొలిరోజు ఉద‌యం 9 గంటలకు విశేష పూజ జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇక్కడ అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ ఉచితంగా కల్యాణోత్సవం, కుంకుమార్చన సరస్వతీ పూజ , లలితా సహస్రనామం మొదలైన పూజల్లో పాల్గొనే విధంగా అందరికీ ఉచితంగానే టిక్కెట్లు పంపిణీ చేశారు. తొలిరోజు సోమవారం సాయంత్రం ఏడు గంటలకు ఇక్కడ పెద్ద శేషవాహనంపై స్వామివారు అంగరంగ వైభవంగా మాడ వీధుల్లో పల్లకి పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ అధ్యక్షులు దూపుగుంట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, కోశాధికారి శ్రీనివాస్ బాబు, సంయుక్త కార్యదర్శి రెడ్డి ఉమామహేశ్వర గుప్తా, కార్యవర్గ సభ్యులు గరిమెళ్ళ నానయ్య చౌదరి (నాని), పట్నాల నరసింహారావు (చిన్న), రఘురాం, బాలగంగాధర్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్, గొల్ల శ్రీధర్, గార్లపాటి మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు త‌దిత‌రులు పాల్గొని ప‌ర్య‌వేక్షించారు.

 

Just In...